రాష్ట్రంలో ఏ దారి చూసినా మేడారం వైపే.. పసిపిల్లాడి నుంచి పండుముసలి దాక ఆ తల్లి దర్శనం కోసమే ఆరాటం .. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు మేడారం బాటపట్టారు. కోట్లలో వస్తున్న భక్తజనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో గిరిజన కుంభమేళాగా పిలిచే సమ్మక్క-సారక్క జాతర నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈనెల 28 నుంచి 31 వరకూ సాగే ఈ జాతర ఈ రోజు పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు గద్దెలపైకి రావడంతో మెుదవవుతుంది. రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి వస్తుంది.
ప్రస్తుతం పిల్ల నుంచి పెద్ద దాకా ఏ నోట చూసినా సమ్మక్క తల్లి పేరే... రేపు చిలకలగుట్టపైకి రానున్న అమ్మవారిని దర్శించుకోవాలనే భక్తుల కోరిక.. ఇన్ని కోట్ల హృదయాలలో కొలువైన ఆ తల్లికి ఎటువంటి ఆడంబరాలు అక్కర్లేదు. నిండుమనసుతో కొలిస్తే చాలు భక్తుల కోరికలు నెరవేరుస్తుంది. బెల్లం ముద్ద సమర్పిస్తే చాలు వారింట్లో బంగారమై వెలుస్తోంది. అందుకే ఆ తల్లిని దర్శించుకోవడానికి కోట్లసంఖ్యలో ప్రజలు మేడారం వస్తున్నారు. ఆ మాతను దర్శించుకొని తమ జన్మధన్యమైందని సంతోషపడుతున్నారు.తెలంగాణ మహాజాతర గిరిజన కుంభమేళాగా పిలిచే సమ్మక్క సారక్క జాతర విశిష్టతపై ప్రత్యేక కథనం
అడవిలో మేడరాజుకు దొరికిన సమ్మక్క
ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉన్న మేడారం ప్రాంతాన్ని అప్పట్లో మేడరాజు అనే గిరిజన రాజు పాలించేవారు. ఈ సందర్భంలో మేడరాజు ఓ సారి వేటకు అడవికి వెళ్లారు. అప్పుడు పుట్ట మీద చిన్నపాప కనిపించింది. ఆ సమయంలో చుట్టూ పులులూ, సింహాలూ ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిందని దేవతగా ఆమెను కొలుచుకున్నారు. సమ్మక్క హస్త వాస్తి సైతం వారి నమ్మకానికి ఎంతో బలం చేకూర్చింది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదని చరిత్ర చెబుతుంది. సమ్మక్క యుక్తవయసు వచ్చాక ఆమెను మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. వీరికి సారలమ్మ (సారక్క), నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మించారు. వీరు ప్రజలతో మమేకమై సుఖసంతోషాలతో జీవిస్తూ తమ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నారు.
ప్రతాప రుద్రుడి దాడి
సూమారు 13 వ శతాబ్దం ఆ సమయంలో కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నాడు. ఆసమయంలో మేడారం ప్రాంతంలో వరుసగా కరువు కాటకాలు వచ్చాయి. వర్షాలు లేక పంటలు పండక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తిండికే కష్టంగా మారడంతో కాకతీయ రాజులకు కట్టాల్సిన పన్ను (కప్పం) చెల్లించలేకపోయారు. అయితే ప్రజల కష్టాన్నీ ఏమాత్రం పట్టించుకోని ప్రతాపరుద్రుడు నిర్ధాక్షనీయంగా మేడారంపై యుద్ధం ప్రకటించాడు.అయితే ప్రతాపరుద్రుని సైన్యం ముందు గెలవలేమని తెలిసినా ఆత్మగౌరవం ప్రాణం కంటే గొప్పదని జాతికి నేర్పడానికి యుద్ధానికి సిద్ధం అన్నారు.
ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు, కూతురు సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడారు వీరమరణం పొందారు. కాకతీయ సైన్యం దాటికి తట్టుకోలేక, పరాభవాన్ని భరించలేక సమ్మక్క కుమారుడు జంపన్న అక్కడి సంపంగి వాగులో దూకి నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగు అని పిలుస్తున్నారు. అయితే తన జాతికి పోరాటం నేర్పడం కోసం సమ్మక్క తల్లి చివరి వరకూ పోరాడింది. రక్తం చిందుతున్నా ఏమాత్రం వెనకడుగువేయకుండా శత్రువుల భరతం పట్టింది. చివరకు శత్రువుల దాడిలో గాయపడిన సమ్మక్క, తన రక్తపు ధారలతోనే చిలకలగుట్ట వైపు వెళ్లింది.
అయితే ఆ సమయంలో నా జాతి బిడ్డలను కాపాడడం కోసం తాను అడివిలోనే ఉంటాను అని చెప్పి మాయమైందని భక్తులు నమ్ముతుంటారు. అనంతరం సమ్మక్క తల్లిని వెతకడానికి అక్కడి ప్రజలు వెళ్లగా చిలకలగుట్టపై ఒక పుట్ట దగ్గర నెమలి పింఛం, పసుపు, కుంకుమలు ఉన్న ఒక భరిణె మాత్రమే కనిపించింది. సమ్మక్క తల్లి కుంకుమ రూపంలోనే ఉందని గిరిజనులు విశ్వసించారు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆ తల్లులను స్మరించుకుంటూ జాతర జరుపుతున్నారు. ఆనవాయితీగా మారింది. 900 సంవత్సరాల కలిగిన ఈ మహాజాతరను 1940 వరకూ చిలకల గుట్టపైన జరిపేవారు అయితే ఆతరువాత వచ్చిన అశేషమైన జనవాహిని కారణంగా కొండకింద జరపడం ప్రారంభించారు. ఈ జాతరకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనుంచే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు వస్తారు.
అయితే కోట్లాది మంది దర్శించుకునే ఈ మహాజాతరను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ ఏడాది సమ్మక్క సారక్క జాతర కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
జనవరి-28 సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాక
జనవరి-29 సమ్మక్క గద్దెలపైకి రాక
జనవరి-30 భక్కుల మెుక్కుల సమర్పణ
జనవరి-31 సమ్మక్క, సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజుల వనప్రవేశం
వన దేవతల వన ప్రవేశంతో ఈ మహాజాతర ముగుస్తుంది.


