ఫుట్‌పాత్‌లపై 'దుకాణాలు'.. నడిరోడ్డుపై 'పాదచారులు' | High Court expresses deep anger over encroachment on footpaths | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌లపై 'దుకాణాలు'.. నడిరోడ్డుపై 'పాదచారులు'

Jun 24 2026 5:34 AM | Updated on Jun 24 2026 5:34 AM

High Court expresses deep anger over encroachment on footpaths

ఉన్నత న్యాయస్థానం పరిసరాల్లోనూ ఇదే పరిస్థితి.. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం 

అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపుపై గత విచారణ సందర్భంగా తామిచ్చిన ఆదేశాలను అమలు చేయని అధికారులపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆక్రమణలు కొనసాగుతుండటంతో ప్రజలు రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. హైకోర్టు సమీపంలోని ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయని, ట్రాఫిక్‌ రద్దీ పెరగడానికి కారణమవుతున్నాయని పేర్కొంది.  న్యాయవాదులు, వ్యాజ్యదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. టీజీ–బీపాస్‌ చట్ట ప్రకారం అనధికార నిర్మాణాలపై పౌరులు కూడా అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కోర్టు గుర్తు చేసింది. పట్టణ ప్రణాళిక నిబంధనలను ఉల్లంఘించిన వారికి కోర్టులు ఉపశమనం ఇవ్వకూడదని, అక్రమ, అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు రాజ్యాంగ న్యాయస్థానాలు తమ విచక్షణాధికారాన్ని వినియోగించకూడదని.. సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించింది. ఫుట్‌పాత్‌లపై అక్రమ ఆక్రమణలు ట్రాఫిక్‌ రద్దీని పెంచడంతోపాటు వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రాంగణం నుంచే ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రారంభించి హైదరాబాద్‌ నగరమంతటా విస్తరించాలని అధికారులను ఆదేశించింది. లేకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.  

రెండు వారాల్లో చర్యలు ప్రారంభించాలి.. 
హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని ఇతర పట్టణ కేంద్రాల్లో రోడ్లు సక్రమంగా ఉండటంలేదని, పాదచారులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించేలా ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సీనియర్‌ సిటిజన్‌ బి.సురేందర్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. మే 4న జారీ చేసిన ఆదేశాల అమలుపై ఇప్పటివరకు ఎలాంటి పురోగతి నివేదికను అధికారులు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తం చేసి, శాశ్వత రక్షణ ఏర్పాట్లు చేయాలని, పాదచారులు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని గతంలో ఆదేశించిన విషయం గుర్తు చేశారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement