దాన్యం కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది | Harish Rao Criticise Congress Govt Over Paddy Procurement | Sakshi
Sakshi News home page

దాన్యం కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది

Jun 19 2026 4:48 AM | Updated on Jun 19 2026 4:48 AM

Harish Rao Criticise Congress Govt Over Paddy Procurement

కేంద్ర కోటాల పేరుతో రైతులను మార్కెట్‌కు వదిలేస్తున్నారు

పెండింగ్‌ రైతుభరోసా బకాయిలు వెంటనే చెల్లించాలి: హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: పంట బోనస్‌కు కోతలు పెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల బాధ్యత నుంచి కూడా తప్పుకోవాలని చూస్తోందని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు విమర్శించారు. డిజిటల్‌ కేబినెట్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇకపై కేంద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడం అంటే రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల నుంచి చేతులెత్తేసినట్టేనని పేర్కొన్నారు.

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే వారు ఏం చేయాలన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్‌రావు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పంట బోనస్‌ విషయంలో కూడా ప్రభుత్వం రైతులపై కొత్త షరతులు విధిస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. కేవలం ఏడు రకాల సన్న ధాన్యాలకు మాత్రమే బోనస్‌ వర్తింపజేయడం ద్వారా సాగుపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లకు పరిమితులు విధించడం రైతులను మార్కెట్‌ దయాదాక్షిణ్యాలపై వదిలేయడమేనన్నారు.

కేసీఆర్‌ రైతన్నను రాజుగా నిలబెట్టారని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతును ఆర్థికంగా దెబ్బతీసే విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో నీటి నిర్వహణ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు. ప్రాజెక్టుల్లో నీటి కొరత ఉందని చెబుతూనే ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీల నీటిని ఎందుకు వదిలారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుభరోసా చెల్లింపుల విషయంలో బహిరంగ సభలు నిర్వహించడం హాస్యాస్పదమని, గతంలో పెండింగ్‌లో ఉన్న మూడు విడతలతోపాటు ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నిధులు కలిపి మొత్తం రూ.16,545 కోట్లను ఈ నెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement