సాక్షి,కామారెడ్డి: బాన్సువాడ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఆటో నుంచి కిందకు దూకి ఎనిమిదవ తరగతి విద్యార్థిని సంగీత ప్రాణాలు కోల్పోయింది. విద్యార్థిని మృతికి ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ సునీతే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల వివరాల మేరకు.. మద్నూర్ మండలం కొడిచిర గ్రామానికి చెందిన సంగీత బోర్లం క్యాంప్ గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఈ క్రమంలో ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ సునీత ఇంట్లో ఓ శుభకార్యం కోసం విద్యార్థినులే పాఠశాల ఫర్నిచర్ తరలించారు. తిరిగి ఫర్నిచర్ తీసుకొస్తున్న సమయంలో విద్యార్థిని ఆటోలో ప్రయాణిస్తుండగా జారి పడింది. ఈ ఘటన సీసీ కెమెరాలో కూడా రికార్డు అయింది. తలకు తీవ్ర గాయాలు రావడంతో సంగీత అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తల్లిదండ్రుల ఆందోళన
సంగీత మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ సునీత ఇంటి కార్యక్రమం కోసం విద్యార్థులను పనుల్లో ఉపయోగించడం, ఫర్నిచర్ తరలింపులో పాల్గొనడం వంటి చర్యలపై తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు చేశారు.

పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని తల్లిదండ్రులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక చిన్నారి ప్రాణం కోల్పోవడంతో గురుకుల పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఈ ఘటన, పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో మరోసారి స్పష్టంగా చూపించింది. సంగీత మృతి కుటుంబాన్ని, సహ విద్యార్థులను కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


