● సీఎం ప్రజావాణిలో గ్రామస్తుడి ఫిర్యాదు
రెంజల్(బోధన్): మండలంలోని నీలా గ్రామంలో ప్రభుత్వ స్థలం కబ్జాపై అధికారులు విచారణ చేపట్టారు. సర్వే నంబర్ 745లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు విక్రయించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గ్రామానికి చెందిన గౌరాజి విఠల్ 2024 ఏప్రిల్ నెల 29న కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో హైదరాబాద్‌లోని సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో బోధన్ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రావణ్‌కుమార్‌తోపాటు ఎమ్మారై ఫహీంలు గ్రామానికి చేరుకొని సర్వే చేపట్టారు. రెవెన్యూ రికార్డులో శ్మశాన వాటికిగా ఉన్న స్థలాన్ని గ్రామానికి చెందిన ఓ నాయకుడు తన పలుకుబడితో పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకువచ్చి తన పేరున లేని ఇంటికి నంబర్ మార్పిడి చేసుకున్నట్లు ఫిర్యాదులో వివరించారు. తమ పూర్వీకుల ఆస్తులు ప్రభుత్వ స్థలం పక్కనే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ స్థలంలోని కొంత భాగాన్ని ఆ ప్రజాప్రతినిధి పక్కనే గల ఇంటి వ్యక్తికి అనధికారికంగా విక్రయించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. కబ్జా నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని అధికారులకు విన్నవించారు. కాగా, ఈ విషయమై ఎమ్మారైను వివరణ కోరగా అధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామన్నారు.


