దేశాన్ని ఏలే పాలకులు కావాలి | Government of Telangana Launches School Education Services on WhatsApp | Sakshi
Sakshi News home page

దేశాన్ని ఏలే పాలకులు కావాలి

Jun 20 2026 1:15 AM | Updated on Jun 20 2026 1:17 AM

Government of Telangana Launches School Education Services on WhatsApp

విద్యార్థినికి కిట్‌ను అందజేస్తున్న గవర్నర్‌ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి అడ్లూరి. చిత్రంలో పొన్నం, కె.కేశవరావు, భట్టి, అజహరుద్దీన్‌ తదితరులు

గురుకులాల నుంచి 100 మంది అంబేడ్కర్లు రావాలి

ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతుల కల్పన బాధ్యత నాదే

వచ్చే విద్యా సంవత్సరం నాటికి 119 సమీకృత గురుకులాలు ప్రారంభిస్తాం

ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించే బాధ్యత తెలంగాణ యువతదే

యంగ్‌ ఇండియా స్కూల్‌ కిట్స్‌ పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

గవర్నర్‌తో కలిసి అన్న–అక్క మెంటార్‌షిప్‌ కార్యక్రమం ఆవిష్కరణ 

రూ. 150 కోట్లతో క్రీడామౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపనలు,

ప్రారంభోత్సవాలు... మీ–సేవ ద్వారా వాట్సాప్‌లో పాఠశాల విద్యాసేవల ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ‘గురుకుల విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, గ్రూప్‌ అధికారు­లు­గానే కాకుండా దేశాన్ని ఏలే పాలకులుగా ఎదగాలి. ప్రభు­త్వ విద్యాసంస్థల నుంచి 100 మంది అంబేడ్కర్‌లు తయారు కావాలి. మీరంతా (విద్యార్థులు) తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలిం. దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో విద్య, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వ­హించిన యంగ్‌ ఇండియా స్టూడెంట్‌ కిట్స్‌ పంపిణీ కార్యక్ర­మా­నికి గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా 27.50 లక్షల మంది విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అలాగే గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాతో కలిసి అన్న–అక్క మెంటార్‌షిప్‌ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అలాగే సుమారు రూ.150 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడామౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు సీఎం రేవంత్‌ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్‌ స్కూళ్ల కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటే అద్భుత ఉదాహరణ అన్నారు.

విధ్వంసం నుంచి వికాసం వైపు..
‘అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉందని ప్రజాప్రభుత్వం సంపూర్ణంగా విశ్వశిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ బడుల మూసివేతతో విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించింది. అందుకే బడ్జెట్లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం. విద్యాభివృద్ధికి రూ. 26,600 కోట్లు కేటాయించాం. దీన్ని ఖర్చుగా కాకుండా ంభవిష్యత్‌ తరాలకు పెట్టుబడిగా భావిస్తున్నాం. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మొటిక్‌ చార్జీలు పెంచాం.’ అని సీఎం రేవంత్‌ వివరించారు.

విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసమే.. 
‘విద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకున్నా. ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. కుల వ్యవస్థను రూపుమాపాలనే లక్ష్యంతో సమీకృత గురుకులాలను తీసుకొస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు చేశాం. వచ్చే విద్యా సంవత్సరంలో 119 పాఠశాలలను ప్రారంభిస్తాం. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌తో దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలుపుతాం. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలే లక్ష్యంగా యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. బంగారు పతకాలు సాధించే బాధ్యతను రాష్ట్ర విద్యార్థులపై పెడుతున్నాం’ అని సీఎం రేవంత్‌ చెప్పారు.

బ్లూకాలర్‌ ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాం
‘ఏఐ తుపానుతో కోట్లాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్‌ ఉద్యోగాల కల్పన వైపు దృష్టి సారించాం. యువతకు నైపుణ్యాన్ని అందిస్తున్నాం. ఆంగ్లంతోపాటు జర్మన్, జపానీస్‌ భాషలను నేర్పిస్తున్నాం. ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం. స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. విద్యార్థుల్లో నైపుణ్యాలకు పదునుపెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రేపటి భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉంది. మన తలరాతను మార్చేది చదువొక్కటే. మీరంతా శ్రద్దతో చదవండి. మీకేం కావాలో ఇచ్చే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా’ అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

డ్రగ్స్‌రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యం: గవర్నర్‌
తెలంగాణను మాదకద్రవ్యాల రహితంగా మార్చడమే తన లక్ష్యమని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా చెప్పారు. గతంలో హిమాచల్‌ గవర్నర్‌గా పనిచేసిన తాను ఆ రాష్ట్రాన్ని డ్రగ్స్‌రహితంగా తయారు చేసినట్లు గుర్తుచేశారు. డ్రగ్స్‌ నిర్మూలనపై ఇంటి నుంచే విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర ప్రభుత్వం కూడా నషా ముక్త్‌ భారత్‌ కోసం కృషి చేస్తోందన్నారు. మంచిపని చేసే ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని.. రేవంత్‌ ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తానన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. 

విద్యార్థుల ఆత్మగౌరవానికి ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆత్మగౌరవానికి యంగ్‌ ఇండియా స్టూడెంట్‌ కిట్స్‌ ప్రతీక అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రజాప్రభుత్వం తీర్చిదిద్దుతోందని చెప్పారు. యంగ్‌ ఇండియా స్టూడెంట్‌ కిట్స్‌లో బూట్లు, యూనిఫారాలు, పుస్తకాలు, బెడ్‌షీట్స్‌ వంటి వస్తువులను అత్యంత నాణ్యతతో సేకరించినట్లు వివరించారు. 27 లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ఒక తండ్రిలా బాధ్యత తీసుకొని ఈ కిట్లను అందిస్తున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం భారీ సంస్కరణలు చేపడుతుంటే ప్రతిపక్ష నాయకులు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని.. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, ప్రపంచంతో పోటీ పడుతున్న విద్యార్థులను చూసి ఓర్వడం లేదని విమర్శించారు.

వాట్సాప్‌ ద్వారా 18 లక్షల మంది విద్యా సమాచారం
రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికిపైగా విద్యార్థుల పా­ఠశాల విద్యా సమాచారాన్ని నేరుగా తల్లిదండ్రుల వాట్సా­ప్‌కు పంపే సేవలను గవ­ర్న­ర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు. రాష్ట్ర పక్షి పాలపిట్టను డిజిటల్‌ మస్కట్‌గా పరిచ­యం చేశారు. పాలపిట్ట యానిమేషన్‌ వీడియోల ద్వారా ముఖ్యమైన సమాచారం, అవగాహన సందేశాలు, వీడి­యోలు వాట్సాప్‌లో పంపిస్తారు. విద్యా పురోగతి, పరీ­క్ష­ల సమాచారం, విద్యా సామగ్రి పంపిణీ, స్కాలర్‌­షిప్స్, పాఠశాల కార్యక్రమాలు, ఆరోగ్య, సంక్షేమ కార్య­క్రమాల వంటి అంశాలపై సకాలంలో సమాచారం అందుబాటులోకి రానుంది. విద్యారంగంలో సాంకేతికత వినియోగాన్ని విస్తరించి విద్యార్థుల అభ్యాస ఫలితా­లను మెరుగుపరచడం, తల్లిదండ్రులతో ప్రభుత్వ అనుసంధానాన్ని బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement