మీ ఊళ్లో కోతులున్నాయా? | Government launches survey to address monkey problem | Sakshi
Sakshi News home page

మీ ఊళ్లో కోతులున్నాయా?

Oct 7 2026 5:31 AM | Updated on Oct 7 2026 5:31 AM

Government launches survey to address monkey problem

వాటి వల్ల పంట నష్టం జరుగుతోందా? 

కోతుల సమస్య తీర్చేందుకు సర్వేకు ప్రభుత్వం శ్రీకారం 

గ్రామ కార్యదర్శుల లాగిన్‌లో మూడు ప్రశ్నలతో ఆన్‌లైన్‌ సర్వే 

అన్ని పంచాయతీల నుంచి సమాచార సేకరణ 

సాక్షి, హైదరాబాద్‌: కోతుల సమస్యను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం తెలంగాణ గ్రామాల్లో కోతుల బెడద అనేది తీవ్రమైన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా ఈ–పంచాయతీ పోర్టల్‌లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. గ్రామ పంచాయతీ కార్యదర్శుల లాగిన్‌లో మూడు ముఖ్యమైన ప్రశ్నలతో కూడిన ఆన్‌లైన్‌ సర్వేను పెట్టారు. ఇందులో భాగంగా ...మీ ఊళ్లో కోతులున్నాయా?వాటి వల్ల పంట నష్టం జరుగుతోందా? రోజువారీ కార్యక్రమాలకు ఆటంకం కలగడంతో పాటు ఇవి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయా? అన్న మూడు ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. 

ఈ విధంగా అన్ని పంచాయతీల నుంచి సేకరించిన సమాచారాన్ని ఓ సమగ్ర నివేదిక రూపంలో రాష్ట్రప్రభుత్వానికి పంచాయతీరాజ్‌శాఖ సమర్పించనున్నట్టు అధికారవర్గాల సమాచారం. గ్రామాలను పట్టిపీడిస్తున్న కోతుల బెడదపై పూర్తిస్థాయి డేటా సేకరణ ద్వారా ఈ సమస్య పరిష్కారానికి తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టవచ్చుననే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటుగా పంచాయతీ ఈ–పోర్టల్‌లో రాష్ట్రంలోని 12,760 జీపీల పరిధిలోని గృహ యజమానుల మొబైల్‌ నంబర్లను అప్‌డేట్‌ చేయనున్నారు. దీనివల్ల స్థానిక పన్నుల నోటీసులు, ప్రభుత్వ పథకాల లబ్ధి, ఇతర పంచాయతీ సేవలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు గృహ యజమానుల మొబైల్‌కే నేరుగా మెసేజ్‌ రూపంలో పంపించే వీలు కలుగుతుంది. 

నిరుద్యోగ యువత కోసం కొత్త ఫీచర్‌ 
గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు సంబంధించిన సమాచారం కోసం ‘రూరల్‌ అన్‌ ఎంప్లాయిడ్‌ యూత్‌ డీటెయిల్స్‌ ఎంట్రీ’అనే కొత్త ఫీచర్‌ను కూడా ఈపోర్టల్‌లో చేర్చారు. ఇందులో యువతకు సంబంధించిన విద్యార్హతలు, నైపుణ్యాలతో పాటు మొత్తం 13 రకాల వివరాలను నమోదు చేసేలా పోర్టల్‌ను డిజైన్‌ చేశారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా నిరుద్యోగ యువత సమాచారాన్ని సేకరణ ద్వారా వారికి ఎక్కడికక్కడ వారి వారి అర్హతలు, నైపుణ్యాలను బట్టి వారు కోరుకున్న రంగాల్లో మరింత విస్తృతస్థాయిలోశిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో పనిచేసే ‘ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ మార్కెటింగ్‌ మిషన్‌’(ఈజీఎంఎం)ద్వారా మరింత మెరుగైన పద్ధతుల్లో శిక్షణాకార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ పోర్టల్‌ ద్వారా సేకరించిన యువత వివరాలు, సమాచారానికి అనుగుణంగా వివిధ ఏజెన్సీల ద్వారా శిక్షణా కార్యక్రమాలు, వారి నైపుణ్యాలు, అభిరుచులకు అనుగుణంగా ప్రైవేట్‌సంస్థల్లో ప్లేస్‌మెంట్లు కల్పన దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement