
నూతన మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
రూ.2 లక్షలుగా ఉన్న నాన్ రిఫండబుల్ ఫీజును మరో లక్ష పెంచిన సర్కార్
వచ్చే డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల కాలానికే లైసెన్స్
దరఖాస్తుల రూపంలోనే రూ. 3,500 కోట్లపైన ఆదాయం లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండేళ్లకు సంబంధించిన మద్యం పాలసీని ప్రకటించింది. గత పాలసీతో పోలిస్తే దుకాణాల దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచడం మినహా పెద్దగా మార్పులేమీ లేవు. అయితే దరఖాస్తు ఫీజు పెంపు ద్వారానే కనీసం రూ. 3,500 కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మద్యం దుకాణాల లైసెన్స్ కాలపరిమితిని మూడేళ్లకు పెంచాలని భావించినా, పలు సమీకరణాల దృష్ట్యా లైసెన్స్ కాల పరిమితిలో మార్పులు చేయలేదు. ఈ మేరకు బుధవారం వచ్చే రెండేళ్ల కోసం నూతన మద్యం విధానాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఏఎం.రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు.
లాటరీ పద్ధతిలోనే మద్యం దుకాణాలు
» 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30వ తేదీ వరకు అమలయ్యే ఈ విధానం ప్రకారం.. గతంలో ఉన్నట్టుగానే లాటరీ పద్ధతి (డ్రా) ద్వారా దుకాణాలను కేటాయిస్తారు. అయితే మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన వార్షిక ఫీజు (రిటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్–ఆర్‌సెట్) లో ఎలాంటి మార్పు చేయలేదు.
» 5 వేల జనాభాలోపు ఉన్న మద్యం దుకాణానికి రూ.50 లక్షలుగా ఉన్న ‘ఆర్‌సెట్’ను 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా ఆరు స్లాబులు కేటాయించారు.
» 5 వేల నుంచి 50 వేల జనాభా గల దుకాణాలకు రూ. 55 లక్షలు, రూ. 50 వేల నుంచి లక్ష జనాభా వరకు రూ. 60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల వరకు రూ. 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు రూ. 85 లక్షలు రిటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్‌గా నిర్ణయించారు.
» 20 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలకు ఎక్సైజ్ ట్యాక్స్‌ను రూ.1.10కోట్లుగా వసూలు చేస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని దుకాణాలతోపాటు జీహెచ్‌ఎంసీకి ఆనుకొని ఉన్న 5 కిలోమీటర్ల పరిధివరకు కూడా ఇదే స్లాబ్ వర్తిస్తుంది.
» మునిసిపాలిటీలకు 2 కిలోమీటర్ల వరకు ఆయా మునిసి పాలిటీల్లో అమలయ్యే ‘ఆర్‌సెట్’స్లాబ్ వర్తిస్తుందని ప్రభు త్వం తెలిపింది. వార్షిక ఎక్సైజ్ ట్యాక్స్‌ను లైసెన్స్‌దారులు ఆరు విడతలుగా చెల్లించాలి. మొత్తం ఫీజులో 25 శాతాన్ని బ్యాంకు గ్యారంటీ కింద 25 నెలలకు ఇవ్వాలి. వార్షిక పన్ను కన్నా పది రెట్లు ఎక్కువగా మద్యం విక్రయాలు జరిపితే 10 శాతం టర్నోవర్ ట్యాక్స్ వసూలు చేస్తారు.
అవే రిజర్వేషన్లు
గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను దుకాణాల కేటాయింపులో గతంలోనే మాదిరిగానే అమలు చేస్తారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా వాకిన్ స్టోర్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ఫీజు ను రూ. 5లక్షలుగా నిర్ణయించారు. ఈ స్టోర్స్‌లో గ్లాసులు, వాటర్ బాటిళ్లు, ఐస్, తినుబండారాలను విక్రయిస్తారు. ఇవి కాకుండా వైన్‌షాపునకు అదనంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఒక్కో షాపుపై సంవత్సరానికి రూ.5 లక్షల ప్రత్యేక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఎస్‌ఆర్‌ఈటీ) చెల్లించాల్సి ఉంటుంది.