ఆ చిరునవ్వులిక కానరావు

Fragments Of The Building Slab Crushed To Death By That Child - Sakshi

భాగ్యనగర్‌కాలనీ: భవనం స్లాబ్‌ శకలాలు ఆ చిన్నారి పాలిట మృత్యు పాశాలయ్యాయి. అభం శుభం ఎరగని నాలుగేళ్ల బాలిక నూరేళ్లు నిండేలా చేశాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న  ఒక్కగానొక్క కూతురు కళ్లముందే విగతజీవి కావడం ఆ తల్లిదండ్రులకు అశనిపాతంలా మారింది. తీరని శోకాన్నే మిగిల్చింది. తన చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న కూతురు శాశ్వతంగా దూరం కావడం ఆ తల్లిని దుఃఖం సాగరంలో ముంచింది.  

పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన లాం సునీల్‌ కుమార్, లోత్‌ మేరీ దంపతులు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. హెచ్‌ఎంటీ హిల్స్‌లో నివాసం ఉంటూ శాతవాహన నగర్‌లో బేకరీ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి షరోన్‌ దిత్య (4) కూతురు ఉంది. మంగళవారం ఉదయం తల్లితో కలిసి ఆ చిన్నారి టిఫిన్‌ తీసుకొని బేకరికి వెళుతుండగా పక్కనే పాత ఇంటిపై నిర్మాణంలో ఉన్న శ్లాబ్‌ కూలి బాలిక తలపై పడింది.

చిన్నారి తలకు తీవ్ర గాయాలై మెదడు బయటపడింది. బంధువుల సహాయంతో సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు చెఆప్పరు. కూకట్‌పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చిన్నారి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా భవనాన్ని నిర్మిస్తూ.. చిన్నారి మృతికి కారణమైన ఇంటి యజమాని శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.   

(చదవండి: చాటింగ్‌ చేయొద్దన్నందుకు చావే శరణ్యమనుకుంది)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top