నదులు, నిధులు.. రెండూ ఆంధ్రాకేనా? | Former Minister Harish Rao PowerPoint presentation at Telangana Bhavan | Sakshi
Sakshi News home page

నదులు, నిధులు.. రెండూ ఆంధ్రాకేనా?

Jun 15 2025 2:18 AM | Updated on Jun 15 2025 2:18 AM

Former Minister Harish Rao PowerPoint presentation at Telangana Bhavan

బనకచర్ల పేరిట ఏపీ జలదోపిడీపై కాంగ్రెస్‌ మౌనం ఎందుకు

కేంద్రం నుంచి ఏపీకి మాట సాయం, మూట సాయం

రేవంత్‌కు ప్రతిపక్షాలపై ఇరిటేషన్‌ తప్ప, ఇరిగేషన్‌పై శ్రద్ధ లేదు

నదీ జలాల్లో అన్యాయంపై కేంద్ర మంత్రులు స్పందించాలి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదీ జలాల్లో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలంగాణకు ద్రోహం చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించడం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం పైసా సాయం చేయలేదని, కానీ ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి– బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుకు మాట సాయం, మూట సాయం అందిస్తోందని మండిపడ్డారు. ‘బనకచర్ల ప్రాజెక్ట్‌ పేరిట ఏపీ చేస్తున్న జల దోపిడి – కాంగ్రెస్‌ మౌనం’అనే అంశంపై హరీశ్‌రావు శనివారం తెలంగాణ భవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఇరిటేషన్‌ తప్ప ఇరిగేషన్‌ ఎక్కడ?
‘రేవంత్‌ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఇరిటేట్‌ (అసహనానికి గురిచేయటం) చేయడం తప్ప ఇరిగేషన్‌పై దృష్టి పెట్టడం లేదు. బనకచర్ల లింక్‌ ద్వారా గోదావరి జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నా ప్రతిపక్షాలపై కేసులు, విచారణలు, మంత్రివర్గ విస్తరణ అంటూ సీఎం దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నాడు. నీటిపారుదలపై అఖిలపక్ష సమావేశానికి ముందుకు రాకుండా తాము సన్నద్ధం కాలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్తున్నాడు.

బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేకున్నా కేంద్రం నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏపీకి వత్తాసు పలుకుతోంది. సమైక్య పాలనలో సమైక్య పాలకుల వద్ద బానిసల్లా బతికిన వారు స్వరాష్ట్రంగా ఏర్పడినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్ర నాయకత్వం వద్ద తాకట్టు పెడుతున్నారు. నదీ జలాలను ఏపీకి కేంద్రం దోచి పెడుతున్నా సీఎం రేవంత్‌ స్పందించడం లేదు’అని హరీశ్‌రావు మండిపడ్డారు. 

రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా నదీ జలాల్లో అన్యాయంపై మాట్లాడటం లేదని ఆరోపించారు. చంద్రబాబుతో బీజేపీ దోస్తానా కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ ప్రాజెక్టులను కేంద్ర మంత్రులు అడ్డుకోవడం పాటు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి ఏపీ జలదోపిడీని అడ్డుకునేలా ఏకగ్రీవ తీర్మాణం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. 

కాళేశ్వరంపై త్వరలో ప్రజల వద్దకు
త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌లను సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని హరీశ్‌రావు తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంత రైతులతో కలిసి బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అప్పులపైనా త్వరలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తామని పేర్కొన్నారు. సొంత అవసరాల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడితే రేవంత్‌రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement