జెన్‌జెడ్‌లను కలుపుకొని పోవాలనే ఆలోచనలో మాజీ మావోయిస్టులు..
రాజ్యాంగ పరిధిలో పోరాడుతామన్న ఇప్పటికే చెప్పిన వైనం
మరో పక్క మాజీలకు వెల్‌కమ్ చెప్పిన కమ్యూనిస్టు పార్టీలు
నిషేధం ఎత్తివేసే అవకాశం లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి
‘కాక్రోచ్ పార్టీ’ఏర్పాటు నేపథ్యాన ఆ కోణంలో ఆరా
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాక్రోచ్ జనతా పార్టీ పేరు తో పెల్లుబుకుతున్న అసంతృప్తి, నిరసన కార్యక్రమాలు ఇటు మావోయిస్టులు, అటు నిఘా వర్గాలను ఆలోచనలో పడేశాయి. దీంతో ఎవరికి వారుగా తమ కార్యాచరణను అమలు చేసేందు కు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే జెన్‌జెడ్‌లను కలుపుకొని పోవాలనే ఆలోచనలో మాజీ మావోలు ఉన్నట్టు తెలుస్తోంది.
రాజ్యాంగ పరిధిలో
తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అజ్ఞాతం వీడిన తర్వాత పలు ఇంటర్వ్యూల్లో ‘మా పార్టీపై నిషేధం, మాపై కేసులు ఎత్తివేస్తే రాజ్యాంగ పరిధిలో ప్రజల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు తోటి కామ్రేడ్లకు పిలుపునిస్తా’అని ప్రకటించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన అగ్ర నేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు సైతం కొంచెం అటూఇటుగా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పట్లో మావో యిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసే అవకాశం కనిపించడం లేదు.
కార్యాచరణ ఎలా?
ఓ వైపు ఆపరేషన్ కగార్ తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సమయంలోనే శ్రీలంక, నేపాల్‌లో జెన్‌జెడ్ ఆధ్వర్యాన తిరుగుబాటు ఉద్యమాలు జరిగాయి. ఇక్కడ యువతలో సైతం నేపాల్, శ్రీలంక తరహాలో అసంతృప్తి ఉందనేది మాజీల అంచనా. అయితే దేశవ్యాప్తంగా 1995 నుంచి 2005 వరకు అమలైన తీవ్ర నిర్బ«ంధం కారణంగా సాయుధ విప్లవ పోరాటం ప్రధానంగా అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడేలకే పరిమితమైంది, ఫలితంగా 2000కి అటూఇటుగా జన్మించిన జెన్‌జెడ్ తరంతో సాయుధ విప్లవ పార్టీలకు పెద్దగా సంబంధాలు లేవు.
అయితే ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్‌తో మావోయిస్టు అగ్ర నాయకత్వం అడవులను వదిలింది. అయితే, ఏ తరహా పోరాటం చేయాలి.. ఎవరి కేంద్రంగా పోరాటాలు చేయాలనే కచ్చితమైన కార్యాచరణకు మాజీ మావోయిస్టులు రాలేకపోతున్నారు. వామపక్ష పార్టీలు మాజీ మావోలను తమ పార్టీలోకి రావాలంటూ రెడ్ కార్పెట్ పరిచాయి. అయితే వారితో కలిసి పనిచేయడం సబబా, కాదా అన్న మీమాంస లొంగిపోయిన మావోయిస్టు నేతల్లో ఉన్నట్టు సమాచారం.
యువత కేంద్రంగానే బెస్ట్..
సోషల్ మీడియా వేదికగా వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ సృష్టిస్తోన్న ప్రభంజనం అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది.దీంతో కమ్యూనిస్టు పార్టీలోని సీనియర్ కామ్రేడ్లతో కలిసి నడవడం కంటే, ఉవ్వెత్తున ఎగిసిపడే శక్తి సామర్థ్యాలు, తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత కేంద్రంగానే తమ దీర్ఘకాలిక రాజకీయ కార్యాచరణ మేలనేది ఎక్కువ మంది మాజీల అభిప్రాయంగా తెలుస్తోంది.
దీంతో నిన్నామొన్నటి వరకు యాంటీ మావోయిస్టు ఆపరేషన్లలో కీలకంగా అడవులకు దగ్గరగా పనిచేసిన ఖాకీలు ఇప్పుడు జెన్‌జెడ్‌ల అడ్డా అయిన సోషల్ మీడియాలోకి ఎంటరవుతున్నారు. మారు గుర్తింపులతో ఖాతాలు తెరుస్తున్నారు. గడిచిన రెండు వారాలుగా అన్ని జిల్లాల్లో ఈ తరహా ధోరణి కనిపిస్తోంది. జెన్‌జెడ్ అడుగులు ఎటువైపు అనేది అన్ని వర్గాలకు గమనించతగ్గ అంశంగా మారిపోయింది.


