
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం శివారులో మూడోసారి పత్తి విత్తనాలు నాటుతున్న దృశ్యం
కరుణించని వరుణుడు.. జోరందుకోని సాగు..
రాష్ట్రంలో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు.. 8 జిల్లాల్లో తీవ్రం
గత ఏడాది ఇప్పటికి 38 లక్షల ఎకరాల్లో పంటలు.. ఈ ఏడాది 29 లక్షల ఎకరాలకే పరిమితం
ముందస్తు వర్షాలతో వేసిన విత్తనాలు మొలకెత్తని వైనం
కొన్నిచోట్ల మొలకలు వచ్చినా ఎండిపోతున్న తీరు
పత్తి, మక్క రైతుల పరిస్థితి దారుణం..
మళ్లీ మళ్లీ విత్తనాలు వేస్తున్న పత్తి రైతులు
అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నామంటూ ఆవేదన
సాక్షి, హైదరాబాద్/వరంగల్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జూన్ ముగిసిపోతున్నా.. సరైన వర్షాలు లేక లక్షలాది ఎకరాలు సాగుకు నోచుకోలేదు. మరోవైపు నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో కురిసిన తొలకరి జల్లులకు మురిసి విత్తనాలు వేసిన రైతులు.. కొన్నిరోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో దిక్కులు చూస్తున్నారు. ఆకాశంలో మబ్బులు కన్పించగానే ఆశగా చూస్తున్నారు గానీ ఫలితం ఉండటం లేదు.
వర్షాలు పడకపోవడం..ఈ సీజన్లో సాగయ్యే పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్ వంటి పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వర్షాలపై ఆధారపడి చాలా జిల్లాల్లో వేసిన ఆయా పంటల విత్తనాలు అనేక ప్రాంతాల్లో మొలకెత్తలేదు. ముఖ్యంగా పత్తి, మక్క మొలకలు రాలేదు. కొన్నిచోట్ల మొలిచినా నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి వృధా అవుతుండగా..అనేకచోట్ల రైతులు మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెడుతూ రెండోసారి, మూడోసారి విత్తనాలు నాటుతున్నారు. దుక్కులు దున్ని, భూమి చదును చేసి, విత్తనాలు వేసిన ఒక్కో పత్తి రైతు ఎకరానికి రూ.10 వేల దాకా నష్టపోయే పరిస్థితి ఉందని అంటున్నారు.
8 జిల్లాల రైతులపై తీవ్ర ప్రభావం
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితి ఉంది. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జనగాం, సూర్యాపేట జిల్లాల్లో వర్షభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 190 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, 90 మండలాల్లో వర్షపు చుక్క పడలేదు.
ఈ జిల్లాల్లో 60 నుంచి 72 మిల్లీ మీటర్ల వరకు లోటు వర్షపాతం ఉండగా, ముందస్తు వానలతో పలు మండలాల్లో పత్తి, మక్కలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటివరకు విత్తనాలు వేయని వారు వర్షాలు పడిన తర్వాత వేద్దామని చూస్తుండగా, ఆలస్యంగా వేసిన విత్తనాలతో పంట దిగుబడి రాదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
పత్తి, మక్క పంటల పరిస్థితి దారుణం
రాష్ట్రంలో 70 నుంచి 100 శాతం వర్షాభావ పరిస్థితుల కారణంగా.. వర్షాధార పంటలుగా వేసిన పత్తి, మక్క ఇతర మెట్ట పంటల పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో కేవలం 0.3 ఎంఎం వర్షం కురిసింది.. అంటే ఒక్క తుంపర కూడా లేదని నివేదికలు చెప్తున్నాయి.
ఇదే పరిస్థితి చింతలపాలెం, నేరేడుచర్ల, పెన్పహాడ్, చివ్వెంలలో ఉంది. ఖమ్మంలో కామేపల్లి, యాదాద్రి భవనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట, అడ్డగూడూరు, భువనగిరి, నల్లగొండ జిల్లా శాలిగౌరారం, కనగల్, పెద్దవూర, కరీంనగర్లో చిగురుమామిడి, కరీంనగర్ రూరల్, వేములవాడ, సంగారెడ్డిలో పుల్కల్, జిన్నారం, మెదక్లో మనోహరాబాద్, నార్సింగ్, సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు, మిరుదొడ్డి, హుస్నాబాద్, జనగామ జిల్లాలో కొడకండ్ల, జఫర్ఘడ్, వరంగల్లో నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లిలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
హనుమకొండ జిల్లాలో కమలాపూర్, ఐననోలు, మహబూబాబాద్ జిల్లాలో గార్ల, గూడూరు, కేసముద్రం, చిన్నగూడూరు, పెద్దవంగర, పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు, కమాన్పూర్, సుల్తానాబాద్, జగిత్యాలలో బీఆర్పూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనపూర్, గోరి కొత్తపల్లి, మహదేవ్పూర్, టేకుమట్ల, మంచిర్యాల రూరల్, భద్రాద్రిలో పినపాక, ఇల్లెందు, గుండాల మండలాల్లో సుమారు 70 నుంచి 100 శాతం వరకు లోటు వర్షపాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
గత ఏడాది కన్నా తక్కువ పత్తి సాగు
రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత ఏడాది ఈ సమయానికి 38 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, అది ఈసారి కేవలం 29.89 లక్షలకే పరిమితమైంది. వేసిన పంటల్లో అధికంగా పత్తి 22.84 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో అత్యధికంగా సుమారు 9 లక్షల ఎకరాలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే సాగు చేశారు.
ఆ తర్వాత సంగారెడ్డిలో 2.75 లక్షల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, నల్లగొండ జిల్లాల్లో సగటున 1.10 లక్షల ఎకరాల్లో సాగైంది. వర్షాలు లేకపోవడంతో చాలా జిల్లాల్లో ఇంకా విత్తనాలు వేయలేదు. అత్యధిక వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సూర్యాపేటలో గత సంవత్సరం ఇప్పటివరకు 46 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈసారి కేవలం 7 వేల ఎకరాల్లో సాగు చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పత్తి సాగు గత ఏడాదితో పోల్చుకుంటే సగం కూడా కాలేదు.
మిగతా పంటల పరిస్థితీ ఇదే..
పత్తితో పాటు మొక్కజొన్న, జొన్నలు, కందులు, సోయాబీన్ విత్తనాలు వేసిన రైతులు కూడా వానలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరుతడి పంటలైన ఇవి మొలకెత్తడానికి, మొలకెత్తిన విత్తనాలు మొక్కలుగా పెరగడానికి వర్షం తప్పనిసరి. అయితే విత్తనాలు నాటిన తరువాత వర్షాలు లేకపోవడంతో చాలాచోట్ల మొక్కలు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వానాకాలం – 2025 సాగు ప్రణాళిక (ఎకరాలలో...)
– సాగు అంచనా :1,32,44,305
– గతేడాది ఈ సమయానికి సాగు: 38,06,097
– ఈ సీజన్లో ఇప్పటివరకు సాగు: 29,89,562
– పత్తి సాగు అంచనా: 4893016
– గత ఏడాది ఇదే సమయంలో: 2858337
– ఇప్పటివరకు సాగైన పత్తి విస్తీర్ణం: 22,84,474
– మొక్కజొన్న సాగు అంచనా : 5,21,206
– గత ఏడాది ఇదే సమయంలో: 1,25,235
– ఇప్పటివరకు సాగైన మొక్కజొన్న విస్తీర్ణం : 1,17,309
లక్ష నష్టం..ఇంకో లక్ష అప్పు చేయాల్సిందే
ఇతను జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన కౌలు రైతు బాల్నె చిన్న కొమురయ్య. రోహిణి కార్తెలో కురిసిన తొలకరి వర్షం నేపథ్యంలో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.30 వేలకు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి విత్తనాలు నాటాడు. భూమి దున్నేందుకు, విత్తనాలకు మరో లక్ష రూపాయల పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ తర్వాత వర్షాలు కురవలేదు. దీంతో 20 శాతం విత్తనాలు కూడా మొలకెత్తలేదు. మొలకెత్తినవి కూడా వర్షం లేకపోవడంతో పాటు అధిక ఉష్ణోగ్రతతో ఎండిపోతున్నాయి. దీంతో వర్షాలు పడి కాలం కలిసొస్తే మళ్లీ భూమి దున్ని విత్తనాలు పెట్టాల్సిందేనని, మళ్లీ లక్ష రూపాయల అప్పు వెతుక్కోవాల్సిందేనంటూ కొమురయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
మొక్కజొన్న మొలకెత్తలే..
ఈ ఫొటోలోని మహిళా రైతు పేరు పావని. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కలకత్త తండాకు చెందిన ఈమె ఎకరం పొలంలో పత్తి, మరో ఎకరంలో మొక్కజొన్న విత్తనాలు పెట్టింది. విత్తనాలు వేసి 25 రోజులు దాటినా చినకు పడకపోవడంతో రెండు పంటలు మొలకెత్తలేదు. ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.20 వేల పెట్టుబడి పెట్టింది. బుధవారం కొద్దిగా కురిసిన వానతో అక్కడక్కడ కొన్ని పత్తి విత్తనాలు మొలకెత్తాయి. అయితే ఇప్పటివరకు ఎండిన నేపథ్యంలో 70 శాతానికి పైగా సాల్లలోనీ పత్తి మొక్కలు పీకేసి మళ్లీ గింజలు పెడదామని ఆలోచిస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటికి రెండుసార్లు నాటినా..
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన బానోతు వీరన్న తనకు ఉన్న రెండెకరాల భూమిలో 20 రోజుల క్రితం పత్తి విత్తనాలు విత్తాడు. దున్నినందుకు, విత్తనాలకు, కూలీలకు సుమారు రూ.20 వేలు ఖర్చయింది. ఆ తర్వాత తేలికపాటి జల్లులు తప్ప వర్షాలు పడలేదు. దీంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో నాలుగు రోజులు క్రితం మళ్లీ దుక్కి దున్ని మరోసారి విత్తనాలను కొనుగోలు చేసి కూలీలతో నాటించాడు. గత మూడు రోజులుగా తేలికపాటి చినుకులే పడడం వల్ల అవి కూడా మొలకెత్తే పరిస్థితి కని్పంచడం లేదని వీరన్న వాపోతున్నాడు. వానాకాలం మొదటి దశలోనే అప్పుల పాలవుతున్నానని చెప్పాడు.
గింజలు పెట్టింది గత్త మల్ల చుక్క పడలేదు
నెలకింది పడ్డ వానలకు ఐదు ఎకరాల్లో పత్తి పెట్టినం. పత్తి గింజలు పెట్టింది గత్త మల్ల చుక్క పడలేదు. దీంతో మొలకలు రాలేదు. మళ్లీ విత్తనాలు వేసేందుకు దున్నుతున్నాం. రూ.35 వేలు అదనంగా పెట్టుబడి అవుతోంది.
– సిలువేరు లచ్చయ్య, రైతు, జూలపల్లి, పెద్దపల్లి జిల్లా
కురవాల్సిన సమయంలో పడట్లేదు
మే నెలలో వర్షాలు కురవడంతో నాకున్న 3 ఎకరాలు దుక్కి దున్ని పత్తి విత్తనాలు వేసిన. సుమారు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టిన. విత్తనాలు వేసి దాదాపు 25 రోజులు గడిచినా వర్షాలు పడకపోవడంతో గింజలు మొలకెత్తలేదు. ఎండలు కొట్టాల్సిన సమయంలో వర్షాలు పడ్డాయి. కురవాల్సిన సమయంలో పడట్లేదు. జూన్లో ఇప్పటివరకు వర్షాలే కురవలేదు. విత్తిన పత్తి విత్తనాలను చీమలు తినేసి ఉంటాయి. అదే జరిగితే మళ్లీ పెట్టుబడి పెట్టి పత్తి గింజలు కొని విత్తాలి.
–బాదావత్ చంటినాయక్, పూసలతండా,గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా