వర్షం వచ్చినా సభ ఆగదు | Farmers blessing meeting to be held in Matkepalli Chintakani Mandal on the 30th | Sakshi
Sakshi News home page

వర్షం వచ్చినా సభ ఆగదు

Jun 29 2026 3:44 AM | Updated on Jun 29 2026 3:44 AM

Farmers blessing meeting to be held in Matkepalli Chintakani Mandal on the 30th

రెండున్నరేళ్లలో చేపట్టిన పనులను రైతులకు వివరిస్తాం 

బీఆర్‌ఎస్‌ నేతలు పొర్లుదండాలు పెట్టినా ప్రజలు క్షమించరు 

సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి పొంగులేటి  

సభాప్రాంగణంలోకి వర్షపు నీరు...నేటి రైతుమేళా రద్దు

చింతకాని: అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఈ వివరాలను 30వ తేదీన చింతకాని మండలం మత్కేపల్లిలో జరిగే రైతు ఆశీర్వాద సభలో వివరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా మత్కేపల్లిలో జరిగే రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రి పరిశీలించారు. వర్షం వచ్చినా సభ రెట్టింపు ఉత్సాహంతో జరుగుతుందని.. తమ పథకాలు కూడా అదే స్థాయిలో అమలవుతాయని పొంగులేటి తెలిపారు. దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని రాష్ట్ర రైతులు పండించినా మద్దతు ధరతో కొనుగోలు చేసి వారంలో డబ్బు జమ చేశామన్నారు. 

బీఆర్‌ఎస్‌ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తున్నామని, రహదారుల నిర్మాణానికి పెద్దమొత్తంలో నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తోందని తెలిపారు. పదేళ్ల కాలంలో ప్రజా, రైతు సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్‌ఎస్‌ నేతలను ప్రజలు తిరస్కరించగా.. 30న జరిగే సభకు వచ్చే లక్షలాది మంది రైతులు, జనాన్ని చూస్తే బీఆర్‌ఎస్‌ నేతల గుండె పగలడం ఖాయమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు పాదయాత్ర చేసినా, పొర్లుదండాలు పెట్టినా కారు కూతలు కూస్తున్న వారిని ప్రజలు క్షమించబోరని తెలిపారు. 

బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు తమ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లోనూ వారి ఓటమిని స్వీకరించినట్టు తెలుస్తోందని చెప్పారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదటి విడతలో ఇచ్చిన ఇళ్లలో 25 శాతం కూడా లేవన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్, డైరెక్టర్‌ గోపి, కలెక్టర్‌ దివాకర టీఎస్, సీపీ సునీల్‌దత్, ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, కనకయ్య, రాగమయి పాల్గొన్నారు.  

‘రైతు ఆశీర్వాద సభ’పై నేడు నిర్ణయం 
ఆదివారం సాయంత్రం గంట పాటు కురిసిన భారీ వర్షానికి సీఎం సభాప్రాంగణం నీటితో నిండి బురదమయంగా మారింది. సోమవారం రైతుమేళా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన 150 స్టాళ్లలో కొన్ని గాలులకు పడిపోయా యి. తొలుత రెండు రోజులు రైతు మేళా నిర్వహించాల నుకున్నా, శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చిత్తడిగా మారడంతో ఆదివారం కార్యక్రమాన్ని రద్దు చేశారు. సోమవారం నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో రైతుమేళా నిర్వహించడం లేదని అధికారికంగా ప్రకటించారు. సభా ప్రాంగణ పరిస్థితులను సోమవారం పరిశీలించాక రైతు ఆశీర్వాద సభపై తుది నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ దివాకర ఒక ప్రకటనలో వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement