‘ఆ దారి’ నుంచే భారత్‌లోకి.. | Facts about illegal immigration of Bangladeshis | Sakshi
Sakshi News home page

‘ఆ దారి’ నుంచే భారత్‌లోకి..

Jul 1 2026 4:59 AM | Updated on Jul 1 2026 4:59 AM

Facts about illegal immigration of Bangladeshis

ఆ 53 కిమీ...అక్రమ వలసలకుకేరాఫ్‌ అడ్రస్‌! 

బంగ్లాదేశ్‌ నుంచి అసోం, బెంగాల్‌మీదుగా చొరబాటు 

ఆయా సరిహద్దుల్లో25, 28 కి.మీ పరిధిఅనుకూలం 

వీరికి కోల్‌కతాలోని హౌరానుంచి నకిలీ గుర్తింపుకార్డులు 

వ్యభిచార దందాలోకి మహిళలు, కూలీలుగా పురుషులు 

ఇటీవల చిక్కిన ఐదుగురి విచారణలో వెలుగులోకి.. 

సాక్షి, హైదరాబాద్‌: ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని రెండు రాష్ట్రాల్లో ఉన్న 53 కిలోమీటర్ల ప్రాంతం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చే వారికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అసోంలో ఉన్న 25 కిమీ, పశ్చిమ బెంగాల్‌లోని 28 కిమీ ప్రాంతాల్లోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న బంగ్లాదేశీయులు సరిహద్దులు దాటుతున్నారు. కోల్‌కతా నుంచి నకిలీ గుర్తింపుకార్డులు పొంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి బెంగాల్‌ వాసులుగా స్థిరపడుతున్నారు. ఇలా వచ్చిన వారిలో మహిళలు, యువతులు వ్యవస్థీకృత వ్యభిచారం, పురుషులు..యువకులు దినసరి కూలీలుగా స్థిరపడుతున్నారు. ఖైరతాబాద్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇటీవల పట్టుకున్న ఐదుగురు బంగ్లాదేశీయుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

ఆ రెండు రాష్ట్రాల నుంచే ఈజీ...
బంగ్లాదేశ్‌ సరిహద్దు సుమారు 4,096 కిమీ పొడవు ఉంది. ఇది పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. అయితే పశ్చిమ బెంగాల్, అసోంల్లో ఉన్న 53 కిలోమీటర్లు మాత్రమే అక్రమంగా సరిహద్దులు దాటడానికి అనుకూలంగా ఉంది. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాలని భావించే వాళ్లు బంగ్లాదేశ్‌లోని జషోర్‌ జిల్లాకు చేరుకుంటున్నారు. ఈ సరిహద్దు సుమారు 102 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఇందులో శార్షా ఉపజిల్లాలోని బెనపోల్‌ రెండు దేశాల మధ్య ప్రయాణికులు, సరుకుల రవాణాకు అత్యంత కీలకమైన ప్రాంతం. అయితే పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు, మాల్దా జిల్లాల్లోని 28 కిమీ...అసోంలోని ధుబ్రి జిల్లాలోని బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతంలో ఉన్న మరో 25 కి.మీ ప్రాంతమే అక్రమంగా ప్రవేశానికి అనుకూలంగా ఉంటోంది.

పడవలు, పంటపొలాల మీదుగా... 
ఈ రెండు ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఉన్న గేడే, కృష్ణగంజ్, తేహట్ట, ముర్షిదాబాద్‌ జిల్లాలోని పద్మా నది పరీవాహక ప్రాంతాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని సుందర్‌బన్స్‌ నదీ మార్గాలు, కూచ్‌బెహార్‌ జిల్లాలోని ఉత్తర సరిహద్దు ప్రాంతాలు అక్రమ వలసలకు ఉపకరిస్తున్నాయి. అలాగే అసోంలోని కరీమ్‌గంజ్‌ జిల్లాలో ఉన్న కుషియారా నది పరీవాహక ప్రాంతాలు, మాంకాచర్‌ జిల్లాలోని నదీ మార్గాలు, కాచర్‌ జిల్లాలోని కొన్ని సరిహద్దు గ్రామాల పరిసరాలు కూడా వారికి ఉపకరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, నదులు, గ్రామాలు సరిహద్దుకు ఆనుకుని ఉండడంతో పాటు కంచె, సరైన గస్తీ లేకపోవడం అనుకూలంగా మారాయి. నదులను చిన్న పడవల ద్వారా దాటడం, రాత్రి వేళల్లో వ్యవసాయ భూముల ద్వారా ప్రవేశించి భారత్‌లోకి వచ్చేస్తున్నారు.  

హౌరా కేంద్రంగా... 
ఇలా అక్రమంగా వలసవచ్చే వారికి సహకరించడానికి కోల్‌కతాలోని హౌరాలో కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి. ఈ గ్యాంగ్స్‌ ఆ బంగ్లాదేశీయుల్ని బెంగాల్‌ వాసులుగా మార్చేస్తూ నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టించి ఇస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అక్కడే విద్యనభ్యసించినట్లు బోనఫైడ్‌ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నాయి. ఇలా భారతీయులుగా మారిపోతున్న ఈ బంగ్లాదేశీలను దేశంలోని వివిధ నగరాలకు తరలించడానికి దళారులూ కోల్‌కతాలో సిద్ధంగా ఉంటున్నారు. వీళ్లు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌ సాయంతో యువతుల్ని వ్యభిచారం వైపు, యువకుల్ని కూలీ పనుల వైపు మళ్లిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement