విద్య.. వైద్యం.. 22 సూత్రాలు | Efforts for educational development with 22 types of programs | Sakshi
Sakshi News home page

విద్య.. వైద్యం.. 22 సూత్రాలు

Jul 11 2025 5:07 AM | Updated on Jul 11 2025 5:54 PM

Efforts for educational development with 22 types of programs

కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతిస్పెషల్‌ ఫోకస్‌

22 రకాల కార్యక్రమాలతో విద్యాభివృద్ధికి కృషి

విద్యారంగంలో నూతన ఒరవడి

సామాజిక రుగ్మతలపై అవగాహన

బాలికా సాధికారత కోసం ‘స్నేహిత’  

కరీంనగర్‌: ఆమె ఆలోచనలు వినూత్నం.. కార్యాచరణ విభిన్నం.. విద్యార్థులకు గురువులా.. అనాథలను అమ్మలా ఆదరిస్తున్నారు. కలెక్టర్‌గా కరీంనగర్‌ జిల్లా అభివృద్ధితోపాటు భవిష్యత్‌ తరాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని 22 రకాల కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు కలెక్టర్‌ పమేలా సత్పతి. బాలికల సాధికారత.. సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్‌గా జిల్లాలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టిని సారించారు. కరీంనగర్‌ కలెక్టర్‌గా పమేలా సత్పతి (Pamela Satpathy) చేస్తున్న పనులపై ప్రత్యేక కథనం.  

ఏబీసీ ఆఫ్‌లైఫ్‌ రైమ్‌ 
పిల్లలకు ఏ నుంచి జెడ్‌ వరకు 26 విలువలను సరదాగా, సంగీతం ద్వారా అవగాహన కల్పించే వినూత్న విద్యాసాధనం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో దృశ్యరూపకం రూపొందించి ప్రదర్శిస్తున్నారు. 2025 మే 6న లక్నోలో జరిగిన 10 రాష్ట్రాల ఉన్నతాధికారులకు ఇచి్చన నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో ఈ రైమ్‌ ప్రదర్శించారు.  

» స్నేహిత అనే కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో గుడ్, బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. బాలికల్లో విద్య, నైపుణ్యత, సాధికారత గురించి వివరిస్తున్నారు. సైబర్‌ బుల్లీయింగ్, ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపద సమయంలో 1098 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించడమే స్నేహిత లక్ష్యం.  

» బ్రిక్స్‌ టు బుక్స్‌.. దీని ద్వారా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన 500 మంది విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పించారు. ఈ పిల్లలకు ఇటుక బట్టీల యజమానులను గార్డియన్‌లుగా ఉంచి.. వారి ద్వారానే విద్యార్థులకు రెండు జతల ట్రాక్‌ సూట్లు, బ్లేజర్, రవాణా సౌకర్యం కల్పించారు. జిల్లాలోని వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి విద్యార్థికి 3 జతల చొప్పున మొత్తం 22,033 జతల షూలు, 66,099 జతల సాక్స్‌ పంపిణీ చేశారు.  

» గత నాలుగైదేళ్లుగా ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ఉత్తీర్ణత కాని విద్యార్థుల పరీక్ష రుసుం చెల్లించారు. వ్యక్తిగతంగా మార్గనిర్దేశనం చేయగా 483 మందిలో 432 మంది 2024 జూన్‌లో జరిగిన అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు హాజరై 418 మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన వారిలో 2025 మార్చిలో 13 మంది పాస్‌ అయ్యారు.  

»  విద్యావాహిని–బడి బాట.. ద్వారా కరీంనగర్‌ జిల్లాలోని 16 మండలాల్లో విద్యావాహిని ద్వారా వేసవి సెలవులలో బడిబాట నిర్వహించారు. దీని ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 7,642 (58.18శాతం) మంది విద్యార్థులు పెరిగారు. ‘విద్యావాహిని కరీంనగర్‌’ప్రత్యేకంగా యూట్యూబ్‌ చానల్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా విద్యాసంబంధిత, ప్రేరణ, సృజనాత్మక అంశాలను అప్‌లోడ్‌ చేస్తున్నారు.  

»  వాయిస్‌ ఫర్‌ గరల్స్‌.. బాలికల సామాజిక జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. చిన్న వయసులో పెళ్లి, చదువు మానేయడం ద్వారా కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం.  

»  కాన్షియస్‌నెస్‌ క్లబ్స్‌.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల వినియోగం ద్వారా కలిగే దుష్పరిణామాలపై అవగాహన కలిగించడం దీని ఉద్దేశం. ఈ క్లబ్‌లో ఇద్దరు టీచర్లు, తల్లి లేదా తండ్రి, విద్యారి్థ, ఎక్సైజ్‌ సిబ్బంది సభ్యులుగా ఉంటారు.  

»  టెడ్‌ ఎడ్‌ టాక్స్‌... రాష్ట్రంలో మొదటిసారిగా గ్రామీణ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సాధికారత కోసం పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యం ద్వారా పారమిత విద్యాసంస్థల సహకారంతో టెడ్‌ టాక్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన 300పైగా విద్యార్థులు మండల స్థాయిలో పోటీపడి.. జిల్లా స్ధాయికి చేరిన 40 మంది నుంచి 20 మందిని ఎంపికచేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 

ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థుల టెడ్‌ ఎడ్‌ ప్రసంగాలు రాష్ట్రంలో వైరల్‌గా మారాయి. న్యూయార్క్‌లోని టెడ్‌ ఎడ్‌ ప్రధాన కార్యాలయం ప్రచురించింది. జూన్‌ 25న మరో నలుగురు విద్యార్థులు వారి టెడ్‌ ఎడ్‌ ప్రసంగాలు చేశారు. ఈ టెడ్‌ ఎడ్‌ టాక్స్‌ లైసెన్స్‌ను జంగపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాల, ముల్కనూర్‌ తెలంగాణ మోడల్‌ స్కూల్‌ పొందాయి. ఈ కార్యక్రమం జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో విశేషమైన ఆదరణ పొందుతూ 2024–25 విద్యాసంవత్సరంలో 4,831 ఉన్న విద్యార్థుల నమోదు కాగా 2025–26లో 6,393కు చేరింది. 

గణిత ఒలింపియాడ్స్‌ 
» జిల్లాలోని 175 పాఠశాలల నుంచి మండల, జిల్లా స్థాయిలకు రెసిడెన్షియల్‌ పద్ధతిలో 350 మంది విద్యార్థులను గణిత, సైన్స్‌ ఒలింపియాడ్‌లో పాల్గొనేందుకు నామినేట్‌ చేశారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం కింద అల్ఫోర్స్‌ పాఠశాలతో చేసుకున్న ఒప్పంద సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. 40 మంది టాపర్లు వేసవి సెలవుల్లో ప్రత్యేక కోచింగ్‌ తీసుకొని మోడల్‌ పరీక్షల్లో ప్రతిభ చూపారు.  
» సైన్స్‌ టీచర్లకు, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ రాయల్‌ సొసైటీ వారిచే శిక్షణ ఇప్పిస్తున్నారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా వీరితో ఎంవోయూ చేసుకొని 2024 నవంబర్‌ 5 నుంచి 8 వరకు ఫిజికల్‌ సైన్స్, బయోలాజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.  

ఉచిత సమ్మర్‌ క్యాంపులు 
»  27 విభాగాల్లో అల్ఫోర్స్, సెయింట్‌జార్జ్, పారమిత, వివేకానంద, సాధన ప్రైవేట్‌ పాఠశాలల సహకారంతో ఉచిత సమ్మర్‌ క్యాంపులు నిర్వహించారు. దాదాపు 1,500 మంది విద్యార్థులు ఈత, కంప్యూటర్‌ శిక్షణ, యాంకరింగ్, ఇంగ్లిష్‌ భాషనైపుణ్యాలు నేర్చుకున్నారు. 

»  విటమిన్‌ గార్డెన్స్‌ (స్కూల్‌ లైఫ్‌ స్కిల్స్‌ చాలెంజ్‌).. విటమిన్‌ గార్డెన్‌లలో పెంచుతున్న వివిధ కూరగాయలను, జిల్లాలోని అన్ని ప్రాథమిక, ఉన్నత, కస్తూర్బా, మోడల్‌ స్కూల్స్‌లలో మధ్యాహ్న భోజన వంటల్లో ఉప యోగిస్తున్నారు. ప్రకృతితో అనుసంధానంగా గణిత, సైన్స్‌ ప్రయోగాలు చేస్తూ గార్డెన్స్‌ పెంచుతున్నారు.  

»  30 ప్రేరణాత్మక దృశ్య చిత్రాలను ఎంపిక చేసి ప్రతీ మొదటి, మూడో శనివారం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థులు ఈ సినిమాలు చూసిన తర్వాత వీటిపై సమీక్షలు రాయిస్తున్నారు. తద్వారా భాషాభివృద్ధి, భావవ్యక్తీకరణ, చదవడం, కుదిరించి రాయడం నేర్చుకునే అవకాశం కలుగుతుంది.  

» ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి 2024 నవంబర్‌ 10న ప్రారంభించి 14 ఆదివారాలపాటు నటన నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించి వారితో కరీంనగర్‌ కళాభారతిలో థియేటర్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు.  

»  విద్యార్థుల చదువు నైపుణ్యాల అభివృద్ధికి ప్రతీ బుధవారం ఒక పాఠం శబ్ధపూర్వకంగా చదవడాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులు ఇంటి వద్ద వారి తల్లిదండ్రులు, పెద్దవారిముందు గట్టిగా చదివి వినిపించడం ద్వారా వారు అవసరాన్ని బట్టి సరిచేసి చదివించే అవకాశం ఉంటుంది.  
»  రోజూ ఒక పేజీ రాత వలన విద్యార్థులు రాతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులు రాత నైపుణ్యాలను పరిశీలిస్తూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది.  

» వీధుల్లో ఉన్న జంతువులను చూస్తే ఎలా స్పందించాలనే అంశాలపై సైతం అవగాహన కల్పిస్తున్నారు. రేబిస్‌ వంటి వ్యాధులు, టీకాలు చికిత్స విషయాలు తెలుసుకుంటారు. జిల్లా స్థాయిలో 630 మంది హెచ్‌ఎంలు, 900 ఎకో క్లబ్‌ సభ్యులకు ఓరియంటేషన్‌ నిర్వహిస్తున్నారు.  
» 2005లో ప్రారంభమైన సైన్స్‌ మ్యూజియంను 2024లో పునర్నిర్మించారు. 56 వర్కింగ్‌ మోడల్స్, 80 నమూనాలు, సైన్స్‌ మోడల్స్, డైనోసార్‌ మోడల్, ప్లానెటోరియం ఉన్నాయి.  

» సారథి ట్రాఫిక్‌ పార్క్‌.. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్‌ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది. రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ సంకేతాలు, రోడ్డు గుర్తుల అవగాహన కల్పిస్తున్నారు. తిమ్మాపూర్‌ మండలానికి చెందిన విద్యార్థులు 2024 డిసెంబర్‌ 21 నుంచి 2025 ఏప్రిల్‌ 4 వరకు కరీంనగర్‌ ఆర్టీవో ఉన్న సారథి ట్రాఫిక్‌ పార్క్‌ను సందర్శించి రోడ్‌ సేఫ్టీపై అవగాహన పొందారు. ఇప్పటివరకు 450 మంది విద్యార్థులు, 44 మంది ఉపాధ్యాయులు సందర్శించారు. 

» కెరీర్‌ గైడెన్స్‌ చార్ట్‌.. జిల్లాలోని ఉన్నత, కస్తూర్బా, మోడల్‌ స్కూల్స్‌లో చదివి పాస్‌ అయిన విద్యార్థులకు (5,595 మంది) పదో తరగతి తరువాత ఏం చదవాలో తెలిపే డిటైల్డ్‌ చార్ట్‌ను, కౌన్సెలింగ్‌ బుక్‌లెట్స్‌ను పదోతరగతి ఫలితాలు రాగానే అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement