కొత్తపల్లి: నగరపాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్ చింతకుంట టీఆర్‌కేనగర్‌లో తాగునీటి కటకట నెలకొంది. కేబుల్ వైర్ల కోసం రోడ్ల వెంబడి తవ్వకాలు చేపట్టడంతో మంచినీటి పైప్‌లైన్ పగులుతోంది. దీంతో నీటి కోసం స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 200 కుటుంబాలు ఐదు రోజులుగా నీటిగోస పడుతున్నారు. ఇంటర్‌నెట్ కేబుళ్ల కోసం తవ్వకాలు చేపట్టడంతో చింతకుంట పెట్రోల్ బంక్ సమీపంలోని బావి నుంచి టీఆర్‌కేనగర్‌కు సరఫరా అయ్యే పైప్‌లైన్ పగిలి ఐదురోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు రోడ్డెక్కారు. టీఆర్‌కేనగర్‌లోని శాతవాహన వర్సిటీ– మల్కాపూర్ రోడ్డుపై బుధవారం ఖాళీ బిందెలు, బకెట్లతో బైఠాయించారు. కొత్తపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు.


