కరువు దరువు! | Drought looms across the state by the end of the month | Sakshi
Sakshi News home page

కరువు దరువు!

Oct 8 2026 5:23 AM | Updated on Oct 8 2026 5:23 AM

Drought looms across the state by the end of the month

ఆందోళన కలిగిస్తున్న వర్షాభావం, వేడి వాతావరణం.. రాష్ట్రంలోఎల్‌నినో ప్రమాద ఘంటికలు 

ఇప్పటికే 320 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు.. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు.. కాలువలు, చెరువుల్లోనూ అంతంతే.. 

అడుగంటిపోతున్న భూగర్భ జలాలు 

ఎండిపోయే స్థితిలో వరి, పత్తి పంటలు 

దిగుబడులపై రైతన్నల దిగాలు

కొన్నిచోట్ల వ్యయ ప్రయాసలతోట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్న రైతులు 

అక్టోబర్‌లోనూ కన్పించని ఆశలు.. నెలాఖరుకు రాష్ట్రవ్యాప్తంగా కరువు ఛాయలు!  

ఈ ఫొటోలో కనిపిస్తున్నది కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన పంజాల శ్రీకాంత్‌ వరి పొలం. రెండెకరాల్లో పంట సాగు చేశాడు. కానీ వర్షాలు లేవు. బావిలో నీటి ఊట కూడా తగ్గిపోయింది. దీంతో నీటి తడులు లేక వరి వాడిపోతోంది. పొట్ట దశలో పంట చేతికందకుండా పోతోందని శ్రీకాంత్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.వానాకాలంలో వరి పండుతుందనే నమ్మకంతో జిల్లాలోపంట వేసిన చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఎస్సారెస్పీ నుంచి చివరి దశలోనైనా నీరందిస్తే వేల ఎకరాలుఎండిపోకుండా ఉంటాయని రైతులు అంటున్నారు. -పోలంపల్లి ఆంజనేయులు

రాష్ట్రంపై కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో నెలకొంటున్న పరిస్థితులు రోజురోజుకూ ఆందోళన పెంచుతున్నాయి. సరైన వర్షాలు లేకపోవడం, వేడితో కూడిన వాతావరణం నేపథ్యంలో పంటలు ఎండిపోతున్నాయి. పత్తి కాయ దశలో ఉండగా.. వరి పొట్ట, గింజ దశకు చేరిన ప్రాంతాల్లో నీటి అవసరం పెరిగింది. కూరగాయల సాగుకు కూడా నీళ్లు కావాల్సి ఉంది. వర్షాధారంగా సాగు చేసిన వేరుశనగ, కంది, పొగాకు వంటి పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. 

ఈ నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, జాతీయ స్థాయి వాతావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తుగానే కరువు అనివార్యం అనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 18 జిల్లాల్లోని 320 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించిన ప్రభుత్వం.. పూర్తిస్థాయి నివేదిక కోసం అధికారులను ఆదేశించింది. ఇప్పుడున్న వాతావరణమే ఇకపై కూడా కొనసాగితే నెలాఖరు వరకు కరువు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని, అన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం లేకపోలేదని వ్యవసాయ, వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటికి ఇబ్బంది రాకుండా రాష్ట్రంలోని ఏ జలాశయం నుంచి కూడా పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేయకపోవడంతో శ్రీరాంసాగర్, మిడ్‌మానేరు, శ్రీశైలం, తుంగభద్ర, ఎల్లంపల్లి, లోయర్‌ మానేరు తదితర ప్రాజెక్టులు, చెరువుల కింద పంటలు వేసిన రైతులు లబోదిబోమంటున్నారు. బోర్లు, బావుల కింద పంటలు వేసిన రైతులు భూగర్భ జలాలు అడుగంటి పోతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం తలుచుకుంటూ గండం గట్టెక్కేదెలా అంటూ ఆవేదన చెందుతున్నారు.  

నిలిచిన వర్షాలు.. పెరుగుతున్న వేడి..  
నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి నిష్క్రమించిన తర్వాత వర్షాలు దాదాపు నిలిచిపోవడం, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటం పంటలపై ప్రభావం చూపిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్‌ 1 నుంచి సెపె్టంబర్‌ 30 వరకు సాధారణంగా 740.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 17 శాతం లోటు తో 615.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. మరోవైపు క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కరువు తీవ్రస్థాయికి చేరుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.  

కాయ దశలో పత్తికి కష్టం 
రాష్ట్ర వ్యాప్తంగా 48 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, ప్రస్తుతం కాయ దశలో ఉంది. అయితే పత్తి సాగు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో పొడి వాతావరణం రైతులను కలవరపెడుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో  దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ప్రస్తుతం నేలలో తేమ తగ్గితే కాయల పరిమాణం, బరువు, దిగుబడిపై ప్రభావం పడుతుంది. మరో రెండు మూడు వారాలు పరిస్థితి ఇలాగే కొనసాగితే వర్షాధార పత్తి పొలాల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.  

కూరగాయలకూ నీటి కొరత 
వరి, పత్తితో పాటు కూరగాయల సాగుపైనా నీటి కొరత ప్రభావం పడుతోంది. బోర్లు, బావులు ఎండిపోతున్న ప్రాంతాల్లో రైతులు పంటలను కాపాడుకునేందుకు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్‌ మొదలైన జిల్లాల్లో ఎక్కువగా కూరగాయల సాగవుతుండగా, ఎల్‌నినో నేపథ్యంలో కేవలం బోర్లు, బావుల కిందనే కూరగాయలను పండిస్తున్నారు. వర్షాలను నమ్ముకున్న రైతులు చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల పరిధిలో టమాటా, మెంతి, కొత్తిమీర, పాలకూర వంటి కూరగాయలను సాగు చేసి, నీటి లభ్యత లేక మధ్యలోనే వదిలేశారు. కొన్ని చోట్ల టాంకర్లు, బిందెలతో నీళ్లు తెచ్చి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

అడుగంటుతున్న భూగర్భ జలాలు వర్షపాతం లోటు ప్రభావం కేవలం పంటలకే పరిమితం కావడం లేదు. భూగర్భ జలాల రీచార్జ్‌ తగ్గడంతో బోర్లపై ఆధారపడే రైతుల పరిస్థితి క్రమంగా దిగజారుతోంది. జూన్‌లో రాష్ట్ర సాధారణ సగటు భూగర్భ జలమట్టం 9.46 మీటర్ల లోతులో ఉండగా.. మెదక్, వికారాబాద్‌ ప్రాంతాల్లో 13.30 మీటర్ల వర కు నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ భూగర్భ జలాల పరిశీలనలో 27 మండలాల్లో 13 మండలాలు 20 నుంచి 59 శాతం వరకు వర్షపాతం లోటును ఎదుర్కొన్నట్టు తేలింది. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ మొదలైన జిల్లాల్లో భూగర్భ జలాలు తగ్గుతున్నట్లు సంబంధిత అధికారులు చెపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువుల్లో సుమారు 70 శాతం నీటిమట్టాలు తగ్గిపోయాయి.  

అక్టోబర్‌లోనూ కన్పించని ఆశలు
అక్టోబర్‌లో కొనసాగే వాతావరణం ఆందోళనను మరింత పెంచుతోంది. ఐఎండీ అంచనాల ప్రకారం రాష్ట్రంలో అక్టోబర్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, సాధారణం కంటే ఎక్కువ గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఈ ఏడాది శీతాకాలం కూడా సాధారణం కంటే వెచ్చగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

మరోవైపు అంతర్జాతీయ వాతావరణ సంస్థల తాజా అంచనాల్లో ఎల్‌నినో బలపడుతున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా వాతావరణ సంస్థ ప్రకారం 2026 చివరి త్రైమాసికంలో చాలా బలమైన ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలు 90 శాతానికి మించి ఉన్నాయి. అయితే ఎల్‌నినో ప్రభావం ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా ఉండదని, స్థానిక వర్షపాతం, నేలలో తేమ, భూగర్భ జలాలు, పంటల విధానం తదితర అంశాలు కూడా కీలకమని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కరువు మండలాల ప్రకటన చేయకపోవడం, ఇంకా ప్రాథమిక అంచనాల్లోనే ఉండడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement