మాఫీ ‘లెక్క’ మారిందా? | Doubts over reduction in Loan waiver funds number of farmers getting exemption | Sakshi
Sakshi News home page

మాఫీ ‘లెక్క’ మారిందా?

Jul 18 2024 3:18 AM | Updated on Jul 18 2024 9:15 AM

Doubts over reduction in Loan waiver funds number of farmers getting exemption

మాఫీ పొందే రైతుల సంఖ్య, నిధులు తగ్గడంపై సందేహాలు

తొలి విడత రుణమాఫీపై కాంగ్రెస్‌ సర్కారు ప్రకటనతో గందరగోళం

గత బీఆర్‌ఎస్‌ సర్కారు రూ. లక్షలోపు రుణాల మాఫీకి లెక్కేసిన మొత్తం రూ.19,198 కోట్లు 

ఇప్పుడు అదే రూ.లక్షలోపు రుణాల మాఫీకి సర్కారు చెప్తున్నసొమ్ము రూ.7 వేల కోట్లే 

నాటితో లెక్కేస్తే మూడో వంతే ఉండటం ఏమిటంటున్న రైతు సంఘాల నేతలు 

ఇంత తగ్గడానికి కారణాలేమిటో స్పష్టత ఇవ్వని వ్యవసాయ శాఖ 

నిజానికి గత ఐదేళ్లలో పెరిగిన పంట రుణాలు..  బ్యాంకర్ల సమితి పేర్కొన్న ప్రకారం ఈ ఏడాది మార్చి చివరికి పంటరుణాల మొత్తం ఏకంగా రూ.64,940 కోట్లు 

గత ఏడాది డిసెంబర్‌ 9ని మాఫీకి కటాఫ్‌గా తీసుకున్న సర్కారు..

మాఫీకి అవసరమైన మొత్తం రూ.31 వేల కోట్లు అని వాదన

సాక్షి, హైదరాబాద్‌:  రైతుల పంట రుణాల మాఫీ అంశంలో గందరగోళం కనిపిస్తోంది. రుణమాఫీ ‘లెక్క’ తప్పిందని.. రైతులకు ఇవ్వాల్సిన మొత్తం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి విడతగా రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నామని, 11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమకానున్నాయని కాంగ్రెస్‌ సర్కారు చేసిన ప్రకటన సందేహాలకు తావిస్తోంది. 

గతంలో బీఆర్‌ఎస్‌ సర్కారు రూ.లక్షలోపు పంట రుణాల మాఫీకోసం రూ.19,198.38 కోట్ల నిధులు లెక్కతేల్చితే.. ఇప్పుడు రేవంత్‌ సర్కారు అదే రూ.లక్షలోపు రుణాల మాఫీకి కేవలం రూ.7 వేల కోట్లు అవుతున్నట్టు పేర్కొనడంపై రైతు సంఘాల నేతలు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఇస్తున్న పంట రుణాలు ఏటేటా పెరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. పైగా గత ఐదేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది కూడా. అయినా రుణమాఫీ సొమ్ము మూడో వంతుకు తగ్గడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. 

జిల్లాలకు ‘మాఫీ’ రైతుల జాబితాలు 
రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.లక్ష వరకు రుణమాఫీ సొమ్మును గురువారం రోజున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. 11.50 లక్షల మంది రైతులకు దాదాపు రూ.7 వేల కోట్లు జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు రైతుల జాబితాను జిల్లాలకు పంపించింది. వీరంతా లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులే. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా అధికారులకు అందిన సమాచారం ప్రకారం.. రూ.లక్ష మాఫీ అవుతున్న రైతులు 459 మంది ఉన్నారు. మిగతావారికి అంతకన్నా తక్కువ రుణాలు ఉన్నాయి. 

గత సర్కారు రుణమాఫీ లెక్కలతో..  
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) హామీ ఇచ్చింది. ఇందుకోసం మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు రూ.19,198.38 కోట్ల మేర అవసరమని తేల్చింది. అంతకుముందు 2014లోనూ అప్పటి టీఆర్‌ఎస్‌ సర్కారు రూ.లక్ష రుణమాఫీ ప్రకటించి.. 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్లు మాఫీ చేసింది. మరోవైపు ఈసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 

మొత్తం 39లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు సుమారు రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే.. 2018 నాటి రూ.లక్ష రుణమాఫీ కోసం రూ.19 వేల కోట్లకుపైగా అవసరమవగా.. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కారు అదే రూ.లక్ష వరకు రుణమాఫీ కోసం కేవలం రూ.7 వేల కోట్లనే లెక్క వేయడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 



గత ఐదేళ్లలో భారీగా పెరిగిన పంట రుణాలు 
గత ఐదేళ్లలో పంట రుణాలు భారీగా పెరిగినట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) నివేదిక స్పష్టం చేస్తోంది. 2020–21లో రూ.41,200 కోట్లు, 2021–22లో రూ.42,853 కోట్లు, 2022–23లో రూ.59,060 కోట్లు, 2023–24లో రూ.64,940 కోట్లు రుణాలు ఇచి్చనట్టు తెలిపింది. సర్కారు రుణమాఫీకి నిర్ణయించిన కటాఫ్‌ ప్రకారం చూస్తే.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ నాటికి రైతులు తీసుకున్న రుణాలు రూ.49,500 కోట్లు కావడం గమనార్హం. బ్యాంకర్లు చెప్తున్న వివరాల ప్రకారం ఏటా రైతుల నుంచి రుణాల రికవరీ దాదాపు 90శాతం వరకు ఉంటుంది. 

కానీ తాము గెలిస్తే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ 2022లోనే ప్రకటించిన నేపథ్యంలో.. 2023–24లో తీసుకున్న రుణాలను రైతులు చెల్లించి ఉండరని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అంటే 2022–23లో తీసుకున్న రుణాల్లో కొంత మేరకు, 2023–24లో డిసెంబర్‌ వరకు తీసుకున్న రుణాల్లో చాలా వరకు చెల్లించకుండా ఉన్నాయని బ్యాంకుల సిబ్బంది చెప్తున్నారు. అంటే ఏ రకంగా చూసుకున్నా.. దాదాపు రూ.49 వేల కోట్ల మేరకు పంట రుణాల బకాయిలు ఉంటాయని అంచనా. 

రాష్ట్ర సర్కారు మాత్రం రూ.2 లక్షల వరకు రుణాల మాఫీ కోసం రూ.31 వేల కోట్లే అవసరమని అంచనా వేసింది. పీఎం కిసాన్‌ నిబంధనలు, పాస్‌బుక్కులు, రేషన్‌కార్డుల నిబంధనల వల్ల అర్హులైన రైతుల సంఖ్య బాగా తగ్గి ఉంటుందని.. మాఫీ సొమ్ము అందుకు తక్కువై ఉంటుందని రైతు సంఘాల నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ రూ.2 లక్షలు మాఫీ చేస్తామన్న సర్కారు.. ఇప్పుడు నిబంధనలు ఎందుకు పెడుతోందని ప్రశ్నిస్తున్నారు. 

రుణమాఫీకి నిధుల అన్వేషణలో సర్కారు! 
ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామన్న సర్కారు.. అందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం అన్నిరకాల మార్గాలను అన్వేíÙస్తోంది. నిధులు పూర్తి స్థాయిలో సమకూరకపోవడంతోనే మూడు దశల్లో మాఫీ నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కు చెందిన భూములు అభివృద్ధి చేసి, తనఖా పెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే మర్చంట్‌ బ్యాంకర్ల నుంచి రుణాల కోసం రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)ను జారీ చేసింది. 

ఇక రాష్ట్రంలోని డీసీసీబీలు, ప్యాక్స్‌కు మూలధనం సమకూర్చి బలోపేతం చేసుకుంటామని చెప్పి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి రూ.5 వేల కోట్ల రుణం కోసం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. మద్యం డిస్టిలరీలకు బ్రూవరీస్‌ కార్పొరేషన్‌ చెల్లించాల్సిన బిల్లులను ఐదు నెలలుగా ఆపి ఉంచినట్టు తెలిసింది, ఈ సొమ్మును రుణమాఫీకి మళ్లించాలని భావిస్తున్నట్టు సమాచారం. 

ఆ మొత్తం ఐదారు వేల కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు ఈసారి రైతుభరోసా కింద చెల్లించాల్సిన నిధులను కూడా రుణమాఫీకి మళ్లించినట్లు చర్చ జరుగుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకోగలిగిన రుణాలను కూడా ముందస్తుగా సేకరించడం ద్వారా రూ.ఐదు వేల కోట్లు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. 

రుణాల మొత్తం భారీగా పెరిగినా.. 
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31వరకు మొత్తం రూ.64,940 కోట్లు స్వల్పకాలిక పంట రుణాలు మంజూరు చేశారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ కోసం గత ఏడాది డిసెంబర్‌ 9వ తేదీని కటాఫ్‌గా తీసుకుంది. రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి రూ.31 వేల కోట్లు అవసరమని లెక్కలు వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement