మీరు డెవలప్‌మెంట్‌ సెంటర్లిస్తే.. మేం సీఈవోలనిస్తాం! | Deputy CM Bhatti Vikramarka at the American Freedom 250 celebrations | Sakshi
Sakshi News home page

మీరు డెవలప్‌మెంట్‌ సెంటర్లిస్తే.. మేం సీఈవోలనిస్తాం!

Jun 24 2026 4:14 AM | Updated on Jun 24 2026 4:14 AM

Deputy CM Bhatti Vikramarka at the American Freedom 250 celebrations

అమెరికా ఫ్రీడమ్‌ 250 వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరానికి డెవలప్‌మెంట్‌ సెంటర్లను అమెరికా ఇస్తే.. తాము గ్లోబల్‌ సీఈఓ లను ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇది హైదరాబాద్, అమెరికా మధ్య దౌత్య సంబంధం కాదని... ప్రజల మధ్య, కుటుంబాల మధ్య ఏర్పడిన అనుబంధమన్నారు. ఐటీ నుంచి ఏఐ, క్లీన్‌ ఎనర్జీ వైపు తెలంగాణ–యూఎస్‌ అడుగులు వేస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ వారసత్వ సంపదను కాపాడటంలో అమెరికా సహ కారం అభినందనీయమన్నారు. అమెరికాకు స్వాతంత్య్రం లభించి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌లో నిర్వహించిన ఫ్రీడమ్‌ 250 వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 

1990లలో మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌లో అడుగుపెట్టడం నుంచి.. నేడు సత్య నాదెళ్ల ఆ సంస్థకు సీఈఓగా ఎదగడం వరకు ఉన్న ప్రయాణాన్ని గుర్తుచేశారు. తెలుగువారి నైపుణ్యానికి ఇదొక నిదర్శనమని కొనియాడారు. ‘ఈరోజు మన ఇళ్లలో అమెరికా అనేది మ్యాప్‌లో చూసే ఒక దేశం కాదు. అక్కడ చదువుకుంటున్న మన పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్న బంధువులు, స్టార్టప్‌లు పెడుతున్న యువత రూపంలో అమెరికా ప్రతి తెలుగు ఇంట్లో ఒక భాగమైంది. ఇప్పుడు మనం అమెరికాకు వెళ్తున్నాం అని కాదు, తెలుగే నేరుగా అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడ వేగంగా విస్తరిస్తున్న భాషగా తెలుగు నిలవడం మనందరికీ గర్వకారణం’ అని భట్టి అన్నారు. 

ప్రధాన రహదారికి ట్రంప్‌ పేరు పెట్టాం..
తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌–2025లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లుగా.. అమెరికాతో ఉన్న ప్రత్యేక బంధానికి గుర్తుగా ఇక్కడి యూఎస్‌ కాన్సులేట్‌ సమీపంలోని ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు పెట్టా లని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి గుర్తుచేశారు. ఈ సందర్భంగా అమెరికా రాయబారి సెర్జియో గోర్, కాన్సుల్‌ జనరల్‌ లారా విలియమ్స్‌లతో కలిసి భట్టి విక్రజుమార్క ఆ రహదారి పేరు ఫలకాన్ని ఆవిష్కరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement