కిషన్‌బాగ్ సర్ కేంద్రంలో కలెక్టర్ ప్రియాంక పరిశీలన
సాక్షి,హైదరాబాద్: నగరంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్–2026) ప్రక్రియ ఇంకా గందరగోళంగానే ఉండిపోయింది. అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ నుంచి వాటిని నింపి తిరిగి సమర్పించే వరకు ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) సైతం పూర్తి స్థాయి అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 24న గడువు ముగియనుండటంతో అధికారులు ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేస్తున్నప్పటికీ, వాటిని ఎలా నింపాలి, ఏవైనా పత్రాలు సమర్పించాలి అనే అంశంపై స్పష్టత లేకపోవడం సమస్యగా మారింది.
గేటెడ్ కమ్యూనిటీలతోపాటు కొన్ని ప్రాంతాల్లో బీఎల్‌ఓలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమపై దాడులకు దిగుతున్నారని, ఈ పని నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలంటూ బంజారాహిల్స్‌లోని కొందరు బీఎల్‌ఓలు అధికారులకు వినతిపత్రాలు సమర్పించడం గమనార్హం. ఓటర్ల చిరునామాలు మారడంతో అందరికీ అందజేయలేకపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బీఎల్‌ఓలకు సైతం ఫారాలు నింపడంలో అవగాహన లేదు. ఎన్యూమరేషన్ ఫారాలు అందిన వారిలోనూ చాలామంది ఇంకా వాటిని తిరిగి ఇవ్వలేదు. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసివచ్చి అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. స్వయానా సీఈఓ నుంచి హైదరాబాద్ డీఈఓ దాకా నగరంలో ఫారాల పంపిణీ, సేకరణ విధానాలు తనిఖీలు చేశారు. నిర్లక్ష్యం కనబరిచిన వారికి తాఖీదులు జారీ చేశారు. బీఎల్‌ఓల వివరాలు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టారు.
రాజకీయ పార్టీతో సమీక్ష
జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ రాజకీయ పార్టీలతో వారపు సమీక్ష నిర్వహించారు. ఫారాల పురోగతి గురించి వివరిస్తూ, అందరికీ ఫారాలు అంది, అందరూ వాటిని భర్తీ చేసి ఇచ్చేందుకు బీఎల్‌లు, బీఎల్‌ఏలు, పార్టీల సమన్వయంతో పనిచేసి సహకరించాలని కోరారు. ప్రతి బీఎల్‌ఏ రోజుకు నిరీ్ణత సంఖ్యలో ప్రజల నుంచి భర్తీచేసిన ఫారాలను సంబంధిత సెంటర్‌లో అందజేయాలని విజ్ఞప్తి చేశారు. 2002 నాటి వివరాలు లేవనే కారణంతో ఫారాలు ఇవ్వకుండా ఉండరాదని తెలిపారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సంబంధిత ప్రాంతంలో బీఎల్‌ఓలు అందుబాటులో ఉండాలన్నారు.
చిత్ర విచిత్రాలు
ఫారం నింపాలా.. రూ.100 ఇవ్వాలి
రహమత్‌నగర్: ‘సర్’ ఫారాలు నింపడంలో నిరక్షరాస్యులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. రహమత్‌నగర్, కారి్మకనగర్, బోరబండ డివిజన్లలో చాలా ప్రాంతాల్లో రూ.100 తీసుకుని ఫారాలు నింపి ఇస్తున్నారు. ఈ తంతు బహిరంగంగానే జరుగుతోంది.
ఎన్యూమరేషన్ ఫారం చింపేశాడు..
అంబర్‌పేట: అంబర్‌పేట పరిధిలోని డీడీకాలనీలో రామారావు అనే ఓటరు ఎన్యూమరేషన్ ఫాంను చింపేశాడు. గతంలో ఇచి్చన ఫాంను తీసుకునేందుకు సోమవారం బీఎల్‌ఓ రేణుక వెళ్లగా..చిరాకు గురైన రామారావు దాన్ని చింపి వేసి చిందులు తొక్కాడు. ఫాం నింపడం గందరగోళంగా ఉందంటూ కోపగించుకున్నాడు. దీనిపై ఉన్నతాధికారులతో కలిసి బీఎల్‌ఓ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
విధులకు ఆటంకం..నలుగురి అరెస్టు
బంజారాహిల్స్: ఎన్‌బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో బీఎల్‌ఓల విధులకు ఆటంకం కలిగించారని ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ డివిజన్ బీఆర్‌ఎస్ నేత జేజోళ్ల రాజు ముదిరాజ్, ఆయన భార్య రజిత, తల్లి ఈశ్వరమ్మ, కాంగ్రెస్ నేత బాలనరసింహలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆదివారం వీరు ఒకే వ్యక్తికి 20 ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. సోమవారమూ వివాదం చెలరేగడంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది.


