రాష్ట్రంలో నాలుగు అత్యాధునిక గోశాలలు | CM Revanth Reddy Review Meeting On Cows Protect in Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నాలుగు అత్యాధునిక గోశాలలు

Jun 18 2025 5:13 AM | Updated on Jun 18 2025 5:13 AM

CM Revanth Reddy Review Meeting On Cows Protect in Telangana

మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులు సవ్యసాచి ఘోష్, రఘునందన్‌రావు, శైలజా రామయ్యర్‌ తదితరులు

వేములవాడలో 100 ఎకరాల్లో గోశాల నిర్మాణం 

గోసంరక్షణపై అధ్యయనానికి త్రిసభ్య కమిటీ 

ఐఏఎస్‌లు సవ్యసాచిఘోష్, శైలజా రామయ్యర్, రఘునందన్‌రావుతో ఏర్పాటు 

గోసంరక్షణపై సమీక్షలో సీఎం రేవంత్‌ నిర్ణయాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గోసంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని, ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసేందుకు త్రిసభ్య కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సవ్యసాచి ఘోష్, శైలజా రామయ్యర్, రఘునందన్‌రావుతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో గోసంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. రేవంత్‌రెడ్డి మంగళవారం తన నివాసంలో గోసంరక్షణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యంతోపాటు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గోసంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.

భక్తులు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నా స్థలాభావం, ఇతర సమస్యలతో ఇబ్బందులు వస్తున్నాయని, కొన్నిసార్లు గోవులు మృత్యువాత పడుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు గోవుల సంరక్షణే ప్రధాన ఎజెండాగా రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సూచించారు. ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్‌ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్థక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలోని విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించాలని చెప్పారు.

వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని, గో సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్‌ పేపర్‌ను అధికారులు సీఎంకు అందజేశారు. ఈ సమీక్షలో పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీఎం ముఖ్యకార్యదర్శులు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్,  దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement