Cow Protection
-
నా చూపు పల్లెవైపే: గాయత్రి
పాతికేళ్ల తర్వాత అమ్మమ్మ ఊరు వెళ్లిన గాయత్రికి అక్కడ కబేళాకు తరలిస్తున్న రెండు ముసలి ఆవులు కనిపించి, మనసు కరిగిపోయింది. రైతులను బతిమిలాడి ఆ ఆవులను తీసుకొచ్చి వాటికి ఒక చోటు, నెలకు సరిపడా గ్రాసం ఏర్పాటు చేసింది. అది మొదలు ‘ఇక పోషించలేం అనుకున్న రైతుల దగ్గర నుంచి రెండేళ్లుగా ఒక్కొక్క ఆవును ఒక దగ్గరకు చేరుస్తూ వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటోంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని తాటిచర్లలో అలా ఇప్పటివరకు 84 ఆవులతో గో క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది గాయత్రి గుండపంతుల. బ్యాంకు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులకు వెళ్లినా నలుగురు మనుషులను గో సంరక్షణ కోసం ఏర్పాటు చేసి, వాటి బాగోగులను చూసుకుంటున్న గాయత్రిని కదిలించినప్పుడు ఎన్నో విశేషాలను ఇలా పంచుకున్నారు ఆమె. ‘‘మా అమ్మమ్మ గారి ప్రకాశం జిల్లా ఊరైన తాటిచర్లకు పాతికేళ్ల్ల తర్వాత వెళ్లాను. నా చిన్నప్పుడు చూసిన పల్లెకు ఈ పల్లెకు ఏ మాత్రం పోలిక లేదనిపించింది. ఎక్కడా జీవకళ అనేదే కనిపించలేదు. దాదాపు ఏడెనిమిదేళ్లుగా అక్కడ వర్షాలు లేకపోవడంతో పచ్చటి పంట పొలాలు లేవు. యువతరం పల్లెను వదిలి పట్టణాలకు వెళ్లిపోయారు. వృద్ధులు మాత్రం మిగిలారు అక్కడ. వారితో పాటు వృద్ధ గోమాతలు. వాటిని పోషించలేక రైతులు అమ్మేసుకుంటున్నారు. అది చూసి మనసు కలత పడింది. చిక్కిశల్యంగా ఉన్న రెండు గోవులను కబేళాకు తరలిస్తుంటే అక్కడివారికి నచ్చజెప్పి, వాటిని కాపాడగలిగాను. తెలిసిన వారి గోశాల ఉంటే అందులో వాటిని ఉంచి, పోషణ బాధ్యతలను అప్పజెప్పి తిరిగి హైదరాబాద్ వచ్చేశాను. నేను బ్యాంకు ఉద్యోగిని. డిగ్రీ చదువుకునే కొడుకు, ఫార్మాసిస్ట్ అయిన భర్త.. ఇదీ నా కుటుంబం. ఊళ్లో జరిగిన విషయాలను ఇంట్లో చెప్పాను. గోవులను సంరక్షించే బాధ్యతలో తామూ పాలుపంచుకుంటామని ఇద్దరూ చెప్పారు. దీంతో ప్రతి 15 రోజులకు ఒకసారి తాటిచర్లకు వెళ్లే ప్లాన్ చేసుకున్నాను. వెళ్లినప్పుడల్లా దీనంగా కనిపించిన గోవులను గోశాలకు చేర్చడం, వాటి సంరక్షణకు మనుషులను నియమించడం, గ్రాసం ఏర్పాట్లు చూడటం.. ఇదే పనిగా పెట్టుకున్నాను. ఇప్పుడా గోవులు జీవకళతో కనిపించడం నాకు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది. ఇప్పుడు అక్కడ వర్షాలు పడుతున్నాయి..! రెండేళ్లుగా ఇప్పుడక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. రైతులు వరి పంట వేసుకుంటున్నారు. గోవులున్నాయి కాబట్టి వర్షాలు పడుతున్నాయనే ఆలోచన అక్కడి వారిలో వచ్చింది. పంట చేతికి వచ్చినప్పుడు గడ్డి తీసుకొచ్చి ‘మా వంతుగా ఈ గ్రాసం’ అని గోశాలకు ఓ మోపు గడ్డి ఇచ్చి వెళుతుంటారు. ఇది మంచి పరిణామంగా అనిపిస్తుంటుంది నాకు. కొందరు అవసరం కోసం తప్పక ఆవును అమ్మాలని చూస్తారు. కానీ, ఆవుతో వారికి అనుబంధం ఉంటుంది. చూస్తూ చూస్తూ వాటిని రోడ్డున వదిలేయలేరు. కబేళాకు అమ్మనూ లేరు. దీంతో తమ దగ్గర సాకలేని ఆవులను తీసుకొచ్చి, మా గోశాలలో వదులుతుంటారు. చుట్టుపక్కల హైవేలో ఎవరి పోషణా లేకుండా తిరిగే ఆవులు ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతుంటాయి. అలాంటివాటిని మా గోశాలకు తీసుకొచ్చి వదులుతుంటారు అలా ఇప్పటి వరకు గోశాలలో 84 ఆవులు చేరాయి. అందులో నాలుగు ఆవులకు దూడలు పుట్టాయి. ఆ లేగదూడలతో కాసేపు గడిపితే చాలు– మనసుకు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. సకాలంలో వైద్య సదుపాయాలు రెండేళ్లలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. బెంగళూరు వెళ్లినా నా చూపు పల్లెవైపే ఉంటుంది. మా వారు రవిశంకర్ ఫార్మసిస్ట్ కావడంతో గోవులకు ఏ చిన్న మెడికల్ అవసరం వచ్చినా తగిన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. అలా వైద్య సిబ్బంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి గోవులకు మెడికల్ చెకప్ చేసి వెళతారు. మా వారు, మా అబ్బాయి కూడా ప్రతి నెలా గోశాలకు వెళ్లి ఆవులను చూసి, ఏ చిన్న అసౌకర్యం లేకుండా చూసుకొని తిరిగి వస్తారు. అలా మా కుటుంబం గోశాల సంరక్షణ బాధ్యత తీసుకుంది. ఈ క్రమంలో మా బంధువు, విజయవాడ వాసి అయిన నాగేంద్ర మామయ్య ఆస్ట్రేలియాలో పదిహేనేళ్లు ఉండి సొంతూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన గోశాలకు వచ్చి, ఆవు దూడలతో అనుబంధాన్ని పెంచుకున్నారు. తాను ఇక గోశాలలోనే ఉండిపోతానన్నారు. మేం ముగ్గురం కలిసి గోశాలకు ‘శ్రీ దత్త బృందావన గో క్షేత్రం’ అని నామకరణం చేసి ట్రస్ట్‌గా ఏర్పడ్డాం. గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరకు వెళ్లిన సమయంలో గోశాల గురించి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారు. ‘ఆ ఆవులు ఉన్నన్ని రోజులు వాటిని సాకుతూ ఉండండి’ అన్నారు. ఓ మంచి ప్రయత్నం మొదలుపెడితే అన్ని అనుకూలతలు అవే ఏర్పడతాయని అర్థమైంది. ముందు తరాలకూ అందించాలి.. గో సంరక్షణ గురించి ఈ తరానికి తెలియాలి. అది మనమే నేర్పించాలి. గోవులనే కాదు ఏ ధార్మిక కార్యక్రమమైనా పిల్లలు అలవర్చుకునేలా చేస్తే ముందు తరాలకు మన సంస్కృతిని అందించిన వాళ్లం అవుతాం’ అని వివరించారు గాయత్రి. మంచి పని ఎప్పుడూ మరికొందరికి మార్గం చూపుతూనే ఉంటుంది. ఉద్యోగాలు చేసుకుంటూ, పట్టణ జీవనంలో తీరికే లభించదు అనుకునేవారికి గాయంత్రిలాంటి వారు చేస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు ఓ కొత్త ఆలోచనా పథం వైపు నడిచేలా చేస్తాయి. కర్తవ్యాన్ని బోధిస్తాయి. – నిర్మలారెడ్డి -
గోరక్షణ కోసం.. లిక్కర్‌పై పన్ను
జైపూర్: గోసంరక్షణ కొరకు రాజస్తాన్‌లోని వసుంధర రాజే (బీజేపీ) ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గోవుల రక్షణ కోసం నిధుల సమీకరణకు మద్యంపై 20 శాతం పన్ను విధించింది. ఈ మేరకు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ శర్మ ప్రకటన జారీ చేశారు. విదేశీ, స్వదేశీ, బీర్ లాంటి తేడాలు లేకుండా వాల్యు యాడెడ్ ట్యాక్స్ చట్టం 2003 ప్రకారం అన్నింటిపై ఇరవైశాతం పన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది స్టాంప్‌డ్యూటీపై పదిశాతం పన్ను పెంచడంతో ఏడాదికి రూ.895 కోట్లు ఖజానాకు చేరిందని, ఈ మొత్తం కూడా గోరక్షణ కోసం ఉపయోగిస్తున్నామని అధికారులు తెలిపారు. రాజస్తాన్‌లోని బీజేపీ ప్రభుత్వం గోవుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న విషయం తెలిసిందే. గోరక్షణ కోసం 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.132 కోట్లు, 2017-18లో రూ.123 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 8.58 లక్షల గోవులు ఉన్నాయని వాటి కోసం 2562 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. -
’ గో ’ సంరక్షణ ఎవరిది ?
-
నాడు ప్రాణమిస్తే నేడు ప్రాణం తీస్తున్నాం!
దేశంలో నానాటికి పెరిగిపోతున్న గోరక్షకుల దౌర్జన్యాలపై పార్లమెంట్లో ప్రస్తావన రాగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గోరక్షకులను సమర్థిస్తూ, గోరక్షణ భారత స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగమన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంగీకరించాలన్నారు. ఆమెకు సరైన సమాధానం చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ తడబడగా, స్వాతంత్య్ర పోరాటానికి, గోరక్షణకు సంబంధం లేదంటూ వామపక్షాలు మండిపడ్డాయి. ఇక పార్లమెంట్ వెలుపల తనకు తాను గోరక్షకులుగా చెప్పుకునే సాధ్వీ కమల్ మరో అడుగు ముందుకేసి రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఏప్రిల్ 1న పహ్లూ ఖాన్‌ను కొట్టి చంపిన గోరక్షకులను స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్‌లకు ఆధునిక అనుచరులని పొగిడారు. వారిని అన్ని విధాలా ఆధుకుంటామని, వారిని జైలు నుంచి విడుదల చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. వీరిద్దరి వ్యాఖ్యల తీవ్రతలో ఎంతో వ్యత్యాసం ఉన్నా ఇద్దరూ స్వాతంత్య్ర పోరాటంతో గోరక్షణ ఉద్యమాన్ని ముడిపెట్టారు. గోరక్షణకు, దేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధం ఉందా? ఉంటే అది ఏ రకమైన సంబంధం? ఢిల్లీని బ్రిటిష్ పాలకులు కైవసం చేసుకోకుండా పోరాడాల్సిన భారతీయులైన హిందువులు, ముస్లింలు కలహాలకు దిగకుండా ఉండేందుకు 1857లోనే అప్పటి మొగల్ రాజు బహదూర్ షా జఫర్ నగరంలో గోవధను నిషేధించారు. అదే శతాబ్దంలో, అంటే 1875లో దయానంద సరస్వతి ఆర్యసమాజ్‌ను స్థాపించడం ద్వారా గోరక్షణను ఓ ఉద్యమంగా చేపట్టారు. ఈ ఉద్యమం పంజాబ్‌తో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు విస్తరించింది. ఆ తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న బాల గంగాధర్ తిలక్ కూడా గోరక్షణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది గోరక్షక సంఘాల్లో కూడా సభ్యులుగా కొనసాగారు. అనేక గోరక్షణ శాలల్లో కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ ప్లీనరీ జరిగిన మైదానాల్లోనే కాంగ్రెస్ సమావేశాలు ముగిశాక గోరక్షకుల సమావేశాలు కొనసాగిన సందర్భాలూ ఉన్నాయి. స్వాతంత్రోద్యమం నాటికి బీజేపీ లాంటి పార్టీలు పుట్టలేదు. ఆరెస్సెస్ లాంటి మాతృసంస్థలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదు. గోరక్షణ కోసం ఉద్యమాలు జరిపిన ఆర్యసమాజ్ సంస్థాపకులు దయానంద సరస్వతి రాజకీయంగా గానీ, ఆర్థికంగా గానీ దేశానికి స్వాతంత్య్రం కావాలని ఏనాడూ కోరలేదు. నాడు ప్రజల సమీకరణ కోసం కాంగ్రెస్ పార్టీయే గోరక్షణ గురించి ఎక్కువగా మాట్లాడింది. ముఖ్యంగా స్వతహాగా శాకాహారి అయిన మహాత్మాగాంధీ గోవధను వ్యతిరేకించారు. గోమాంసాన్ని స్వతహాగా త్యజించాలని ఇటు దళితులకు, అటు ముస్లింలకు పిలుపునిచ్చారు. నాడు స్వాతంత్య్ర పోరాటానికి అందరి ఐక్యత అవసరం కనుక ఆయన చట్టపరంగా గోవధను నిషేధించాలని కోరలేదు. అన్ని వేళల అహింసను కోరుకునే మహాత్మాగాంధీ గోవుల రక్షణ కోసం ప్రాణాలివ్వని వాడు హిందువే కాదన్నారు. ఇప్పుడు ప్రాణాలు తియ్యని వాడు హిందువే కాదన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోరక్షణ పేరిట దేశంలో గత రెండేళ్లలో జరిగిన దాడుల్లో ఆరుగురు అమాయకులు మరణించారు. స్వాతంత్య్ర పోరాటంలో గోరక్షణ ఉద్యమాలకు ప్రత్యక్ష సంబంధం ఉన్నా, లేకున్నా అందులో రాజకీయాలు మాత్రం ఉన్నాయి. గోరక్షణ కోసం 18, 19 శతాబ్దంలో ప్రాణత్యాగం చేసిన వారిని దేవుళ్లుగా పూజించిన చరిత్ర మనదన్న విషయాన్ని మరచిపోతున్నాం. అమానుషత్వాన్ని ఆహ్వానిస్తున్నాం. -
గోరక్షణ పేరుతో హింస వద్దు: భగవత్
న్యూఢిల్లీ: గోరక్షణ పేరుతో హింసకు పాల్పడడం సమర్థనీయం కాదని ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ అన్నారు. దేశంలో గోవధను నిషేధిస్తూ చట్టం తేవాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. 'గోరక్షణ పేరుతో ఎటువంటి హింసకు దిగినా మన లక్ష్యానికి చెడ్డపేరు వస్తుంది. చట్టాన్ని తప్పనిసరిగా పాటించాల'ని ఆయన అన్నారు. గోరక్షణ పేరుతో దాడులు పెరిగిపోవడంతో భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో పెహ్లు ఖాన్(55) అనే రైతును గోరక్షకులు హత్య చేయడంతో ఆందోళనలు రేగాయి. బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని విపక్షాలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తాయి. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా భగవత్ పేరును ఇటీవల శివసేన తెరపైకి తెచ్చింది. అయితే రాష్ట్రపతి ఎన్నిక రేసులో తాను లేనని భగవత్ ప్రకటించారు. -
’గోవుల రక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’
హైదరాబాద్ : గోవులను సంరక్షించే బాధ్యత ప్రతి పౌరుడికి ఉండేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్‌రావు సూచించారు. లవ్ ఫర్ కవ్ పౌండేషన్, ప్రాణిమిత్ర రమేష్జాగిర్ధార్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి గోవుల సంరక్షణ కోసం చట్టాలు పటిష్టం చేయాలని గవర్నర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి రిధేష్జాగిర్ధార్ మాట్లాడుతూ....గోవుల సంరక్షణ కోసం ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. దేశంలోని మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రులను, గవర్నర్లను కలిసి వారికి గోవుల ప్రాధాన్యం, రక్షణ, సంక్షేమం కోసం విన్నవిస్తున్నామని తెలిపారు. ప్రతి ప్రజాప్రతినిధి సానుకూలంగా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో గోమాతను పెంచుకుని వాటికి నిత్యపూజలు, నైవేధ్యాలు సమర్పిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.