
సాక్షి, హైదరాబాద్: మూసీ మహోగ్రరూపంతో(Moosi Floods) వరద పోటెత్తి ఇమ్లీబన్(ఎంజీబీఎస్) బస్టాండ్‌ను ముంచెత్తింది. దీంతో అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులంతా ఆందోళనతో ఆగం అయ్యారు. అయితే ఈ వరదపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అత్యవసర సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
మూసీ వరదలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. పోలీస్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేసి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా.. ప్రయాణికులెవరూ ఆందోళనకు గురికావొద్దని.. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టిందని అన్నారాయన. అదే సమయంలో బస్టాండ్ వద్ద ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్ధరాత్రి నుంచే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు నిండుకుండను తలపిస్తున్నాయి. గేట్లు ఎత్తేయడంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. నది వెంట హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు నీటమునిగాయి. పురానాపూల్ వంతెనపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎంజీబీఎస్ జలదిగ్బంధంలో ఉండడంతో బస్సులను ఎక్కడిక్కడే ఆపేస్తున్నారు.
నల్లగొండ, మిర్యాలగూడ, ఖమ్మం నుంచి వచ్చే బస్సులను ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ వరకే అనుమతిస్తున్నారు. అలాగే.. మహబూబ్‌నగర్, కర్నూల్ నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్‌లోనే ఆపేస్తున్నారు. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులను ఉప్పల్ రింగ్‌రోడ్.. ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులను జూబ్లీ బస్టాండ్ వరకే అనుమతిస్తున్నారు. ఇంకోవైపు..
మూసారాంబాగ్ బ్రిడ్జిని మూసేయడంతో.. దిల్‌సుఖ్ నగర్-అంబర్ పేట్ రాకపోకలు ఆగిపోయాయి. వరద నీళ్లతో కాలనీలు మునుగుతుండగా, ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. ఎగువన వరద నీరు పోటెత్తుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.