
విమలక్క, కనకవ్వ పాటకు కోరస్ ఇస్తున్న మంత్రి సీతక్క తదితరులు
హైడ్రా సాంగ్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్/అంబర్‌పేట: అంబర్‌పేటలోని బతుకమ్మకుంట ప్రారంభోత్సవానికి విమలక్క, కనకవ్వ సైతం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత వేదికపై సీఎంరేవంత్‌రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులకు మాత్రమే కూర్చునే అవకాశం కల్పించారు. తన స్థానంలో కూర్చున్న ముఖ్యమంత్రి.. స్టేజ్ సమీపంలో నిల్చుని ఉన్న స్థానిక మహిళలు, కనకవ్వను గమనించారు. దీంతో తన పక్కన, వెనుక ఉన్న సీట్లను ఖాళీ చేయించి వారిని పైకి పిలిచి కూర్చోబెట్టారు.
‘బతుకమ్మ మన ఆడపడుచుల పండుగ, అమ్మ, అక్కల పండుగ. వారికే ప్రాధాన్యం ఇవ్వాలి’అని సీఎం వ్యాఖ్యానించారు. బతుకమ్మకుంట ప్రారంభోత్సవం విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న విమలక్క.. ఈ చెరువుపై రాసిన ఓ పాటను పాడారు. దీనికి కొందరు కోరస్ కావాలని కోరగా.. వేదికపై ఉన్న మంత్రి సీతక్క వెళ్లి కోరస్ అందించారు. ఆమె ఈ పాటతో పాటు కనకవ్వ పాడిన సంప్రదాయ బతుకమ్మ పాటకూ కోరస్ ఇచ్చారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం సెక్యులర్ పండుగగానూ ప్రకటించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.