
గద్దెల ప్రాంగణంలో గంట కొడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క తదితరులు
వెయ్యేళ్లు నిలిచేలా మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం : సీఎం రేవంత్
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా ప్రణాళికలు సిద్ధం
అమ్మల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది
ఆలయం అభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం
తెలంగాణ కుంభమేళాను కేంద్రం గుర్తించాలి..నిధులు ఇవ్వాలన్న సీఎం
ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం.. గద్దెల కొత్త డిజైన్లు విడుదల
నాడు పాలకులు సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఆదివాసీ బిడ్డలను అభివృద్ధి చేయడంతో పాటు ఆదివాసీ దేవతల ఆలయాలకు సేవ చేసే భాగ్యం కలిగింది. సమ్మక్క సారలమ్మల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో మంత్రి సీతక్కకు, నాకు జన్మ ధన్యమైనట్లే. ఆదివాసీలను, పూజారులను,సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం. రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోయేలా ఉంటాయి. మహా జాతరకు మళ్లీ వస్తా.. ఈసారి జాతరను గొప్పగా చేసుకుందాం..
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళా నిర్వహించే మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని ప్రపంచం కీర్తించేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఈ ఆలయం ఉందని, ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కాకతీయులు నిర్మించిన రామప్ప తరహాలో చరిత్రకు సాక్ష్యాలుగా, వెయ్యేళ్లు నిలిచేలా ఆలయ పునర్నిర్మాణాన్ని రాతి కట్టడాలతో చేపడతామని చెప్పారు. మంగళవారం ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క–సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం పనులను సీఎం ప్రారంభించారు.
అంతకుముందు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. అనంతరం సీఎం పోలీసు కమాండ్ కంట్రోల్ రూం ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గిరిజన కొమ్ము కోయ నృత్యంతో, గిరిజన సంప్రదాయం ప్రకారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో రూపొందించిన గద్దెల నూతన డిజైన్లను విడుదల చేశారు. ఆలయం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఆలయం పనుల ప్రారంభించారు. సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
అమ్మల ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం
‘మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఇద తెలంగాణ ప్రజల ఆతీ్మయత, భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. రాష్ట్ర సాంస్కృతిక గొప్పతనాన్ని, గిరిజనుల పోరాట చరిత్రను ప్రతిబింబిస్తుంది. ఆదివాసీలు దేశానికి మూలవాసులు.. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మ తల్లులు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను సందర్శిస్తున్నా.
2023 ఫిబ్రవరి 6న ఈ గడ్డ మీదనుంచే పాదయాత్ర మొదలుపెట్టా. అమ్మల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. శాశ్వత ప్రాతిపదికన గద్దెల ప్రాంగణం, పునర్నిర్మాణం పనులు చేపట్టాం. ఈ ఆలయం డబ్బులతో కొలిచేది కాదు.. నమ్మకంతో కొలిచేది. ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి ఉండాలి. ఇందుకోసం ప్రభుత్వం ఎన్ని నిధులైనా కేటాయిస్తుంది.
ఆదివాసీ కుంభమేళాకు నిధులెందుకివ్వరు..?
‘కుంభమేళాకు వేలకోట్లు ఇస్తున్న కేంద్రం ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడంలేదు? జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నిధులు మంజూరు చేయాలని కోరుతున్నా. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఈ విషయం ఆలోచించాలి. అయోధ్య, కుంభమేళాకే కాదు.. మేడారానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి నిధులు తీసుకురావాలి..’ అని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ..గతంలో ఈ మహా జాతరను అధికారికంగా నిర్వహించే అవకాశం తనకు ఇవ్వాలని కోరుకున్నానని, అదే మాదిరిగా నా కోరికను తీరుస్తూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటై జాతరను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు.
మొక్కులు సమర్పించుకున్న సీఎం
మేడారం సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకున్న సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లకు 68 కేజీల నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. 2024 ఫిబ్రవరిలో తల్లులను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించుకున్నప్పుడు ముఖ్యమంత్రి బరువు 68 కిలోలు కాగా.. ఇప్పుడు కూడా 68 కిలోలే ఉన్నారు.
పూజారులు, ఆదివాసీ సంఘాలతో భేటీ
ఆలయ అభివృద్ధిపై సమీక్ష సందర్భంగా అలయ విస్తరణకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు అధికారులు వివరించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి ఆదివాసీ సంఘాలు తీసుకువచ్చాయి. వీటిపై స్పందించిన సీఎం..ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు.
దీంతో ఆలయ విస్తరణ, అభివృద్ధికి పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. ఆయా కార్యక్రమాల్లో వీరితో పాటు ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బాలునాయక్, కడియం శ్రీహరి, మురళీనాయక్ , రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇక ఒకే వరుసలో గద్దెలు
– ఇదీ మాస్టర్‌ప్లాన్..
సమ్మక్క, సారలమ్మ గద్దెలు ప్రస్తుతం ఒక వరుసలో ఉండగా, వీరి ఎదురుగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఉన్నాయి. అయితే భక్తులు క్యూ లైన్ ద్వారా సమ్మక్క– సారలమ్మను దర్శించుకుని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్దకు రావటం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా నిర్మాణానికి వీలుగా కొత్తగా డిజైన్ రూపొందించారు.
గద్దెల చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్స్ స్థానంలో గ్రానైట్ నిర్మాణం చేపట్టనున్నారు. గ్రానైట్‌పై సమ్మక్క, సారలమ్మ చరిత్రతో పాటు గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు, వారి లిపి, జాతర వైభవం తెలియజేసే బొమ్మలను చెక్కనున్నారు. అదే విధంగా మహా జాతర వేళ భక్తులకు సమ్మక్క, సారలమ్మ తల్లులు.. పగిడిద్ద రాజు, గోవిందరాజుల దర్శనం కష్టం కాకుండా స్థల సేకరణ ద్వారా గద్దెల ప్రాంగణం విస్తరణను ప్లాన్‌లో చేర్చారు. ఇందుకోసం దేవాదాయ శాఖకు చెందిన 4 ఎకరాలు, ప్రభుత్వ భూమి 19 ఎకరాలు.. మొత్తం 23 ఎకరాలు సేకరిస్తారు. అతిథి గృహాలు నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది.