ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ చేసిన సిట్
సాక్షిగా పరిగణిస్తూ సీఆర్పిసీలోని సెక్షన్ 160 కింద నోటీసులు
నేటి ఉదయం 11 గంటలకు హాజరుకావాలని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ఇప్పటివరకు పలువురు మాజీ, ప్రస్తుత అధికారులు, రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే నోటీసులు జారీ చేసిన సిట్..తాజాగా సోమవారం బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీమంత్రి టి.హరీశ్‌రావును సాక్షిగా పరిగణిస్తూ సీఆర్పిసీలోని సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది. బీఆర్‌ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, కేసీఆర్ కుటుంబీకులకు ఈ కేసులో నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో ఉన్న సిట్ కార్యాలయంలో హాజరుకావాలని ఆ నోటీసుల్లో సిట్ స్పష్టం చేసింది.
సోమవారం రాత్రి కోకాపేటలోని హరీశ్‌రావు నివాసానికి అధికారులు వెళ్ళిన సమయంలో ఆయన అందుబాటులో లేరు. సిద్దిపేటలో ఉండటంతో ఇంట్లో ఉన్న వారికి అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఇప్పటివరకు సిట్ చేసిన దర్యాప్తు, నిందితుల విచారణ, వాంగ్మూలాల నమోదు...ఇలా అనేకచోట్ల హరీశ్‌రావు పేరు ప్రస్తావనకు వచ్చింది. న్యాయస్థానంలో దాఖలు చేసిన నివేదికల్లోనూ అధికారులు ఆయన పేరు పొందుపరిచారు. ఈయన ఆదేశాల మేరకు కొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని సిట్ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సిద్దిపేటలో ఉన్న హరీశ్‌రావు నోటీసుల విషయం తెలిసి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిసింది.
త్వరలో మరికొందరికి కూడా..!
2024 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత సిట్‌కు బదిలీ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఇటీవల ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసిన సిట్.. రానున్న రోజుల్లో మరికొందరు కీలక నేతలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హరీశ్‌రావుపై పంజగుట్ట పోలీసుస్టేషన్‌లోనే ఓ కేసు నమోదైంది. అందులో చక్రధర్ తన ఫోన్ ట్యాప్ అయిందని, హరీశ్‌రావు ఆదేశాల మేరకే అది జరిగిందని ఆరోపించారు. అయితే ఈ కేసును ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టేసింది.
తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి సిట్ కార్యాలయానికి వెళ్తారు. ఉదయం 9 గంటలకు ఆయన తన నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూ డా అదే సమయానికి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.


