బెట్టింగ్ యాప్‌ల నుంచిమీకు ఎంత డబ్బు ముట్టింది?
విజయ్ దేవరకొండను గంటకుపైగా ప్రశ్నించిన సీఐడీ
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై ప్రత్యేకంగా ఏర్పాటైన సీఐడీ సిట్ ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా పలువురు సినీ నటులకు నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. మంగళవారం విజయ్ దేవరకొండ సీఐడీ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
‘బెట్టింగ్ యాప్‌ల తరఫున మీరెందుకు ప్రచారం చేశారు? ఈ యాడ్స్ ప్రమోట్ చేయాలని మిమ్మల్ని ఎవరు సంప్రదించారు? యాడ్స్‌లో నటించినందుకు ఎంత డబ్బు తీసుకున్నారు?’అని విజయ్ దేవరకొండను అధికారులు ప్రశ్నించారు. సాయంత్రం 4 గంటల సమయంలో సీఐడీ కార్యాలయంలోకి వెళ్లిన విజయ్‌ని అధికారులు గంటకుపైగా ప్రశ్నించారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో పాల్గొనడానికి దారితీసిన కారణాలు, అందుకు సంబంధించి నగదు లావాదేవీలపై ప్రశ్నించారు.
బెట్టింగ్ యాప్‌ల వైపు ప్రోత్సహించేలా యాడ్స్ చేయడం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గుర్తించారా? అంటూ ప్రశ్నించినట్టు ఓ అధికారి తెలిపారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు విజయ్ సమాధానమిచ్చినట్టు తెలిసింది. కాగా, ఇదే కేసు దర్యాప్తులో భాగంగా బిగ్‌బాస్ ఫేం సిరి హనుమంత్‌ను సైతం అధికారులు ప్రశ్నించారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు ఆమె భారీగా పారితోషికం తీసుకున్న ఆరోపణలున్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలిసింది. గోవిందా 365 అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన సిరి హనుమంత్‌ను అందుకు సంబంధించిన వివరాలు అడిగి నట్టు సమాచారం.
నేడు సీఐడీ ఎదుటకు ప్రకాశ్‌రాజ్
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు దర్యాప్తులో భాగంగా నటుడు ప్రకాశ్‌రాజ్‌కు సైతం సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కీలక సమాచారం సేకరించాల్సి ఉన్నందున తమ ఎదుట హాజరుకావాలని చెప్పారు. సమన్ల మేరకు ప్రకాశ్‌రాజ్ బుధవారం ఉదయం సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నట్టు సమాచారం.


