టాలీవుడ్ ప్రేమ జంటల్లో విజయ్- రష్మిక జోడీ గురించి మనందరికీ సుపరిచితమే. చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాదిలోనే నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. పరోక్షంగానైతే హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరలైంది.
ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన, రష్మిక మందన్నా మైసా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా వచ్చేశాయి. అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా క్రిస్‌మస్, న్యూ ఇయర్ ఉండడంతో ఈ జంట వేకేషన్ ప్లాన్ చేశారు. నూతన ఏడాది వేడుకల కోసం ఫారిన్ ట్రిప్‌కు బయల్దేరారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెకేషన్ ట్రిప్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అయితే విజయ్, రష్మిక హైదరాబాద్ విమానాశ్రయంలో విడివిడిగా కనిపించారు. దీంతో వీరిద్దరు కలిసే వేకేషన్‌కు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.
పెళ్లి గురించి ఇటీవల రష్మికతో ప్రస్తావించగా.. సమయం వచ్చినప్పుడు తానే అందరికీ చెప్తానని తెలిపింది. నిశ్చితార్థ వార్తలను కొట్టిపారేయలేదు.. అలాగని డైరెక్ట్‌గా చెప్పలేదు నేషనల్ క్రష్. ఇటీవలే ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రస్తుతం మైసా చిత్రంలో నటిస్తోంది. గతంలో విజయ్, రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు.


