తెలంగాణ: రైతు సాయంలో సమూల మార్పులు? | Changes in Rythubandhu | Sakshi
Sakshi News home page

తెలంగాణ: రైతు సాయంలో సమూల మార్పులు?

Dec 18 2023 2:12 AM | Updated on Dec 18 2023 8:42 AM

Changes in Rythubandhu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో మార్పులు చేయాలని కాంగ్రెస్‌ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం గుంట భూమి ఉన్న రైతుల నుంచి వందల ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి కూడా రైతుబంధు అందుతోంది.

వ్యవసాయ పనుల ప్రారంభంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సాయపడటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ పథకం కింద.. భారీగా భూములున్న వారికి, ధనికులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలన్న విమర్శలు ఉన్నా యి. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చినా.. అప్పటి సీఎం కేసీఆర్‌ అందరికీ ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. కొందరికే ఇస్తే పథకంలో పైరవీలు, అక్రమాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నది కేసీఆర్‌ భావన అని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పాయి. 

పరిమితి ఐదెకరాలా.. పదెకరాలా? 
కాంగ్రెస్‌ సర్కారు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థికసాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే కొత్త సర్కారు రైతుబంధు సాయానికి ఐదెకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. పదెకరాలలోపు పరిమితి ఆలోచన కూడా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందంటున్నారు.

భారీగా ఆస్తులున్న రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు,అధికారులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రెండు మూడెకరాలున్నా రైతుబంధు ఇవ్వకూడదని భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నందున.. ఇప్పటికిప్పుడే ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో గతంలో మాదిరిగానే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తారని.. వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి వస్తాయని వివరిస్తున్నారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది.  

మొత్తంగా 68.99 లక్షల మందికి.. 
రాష్ట్రంలో రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్‌ నుంచి ప్రారంభమైంది. మొదట్లో ఒక్కో సీజన్‌లో ఎకరాకు రూ.4 వేల చొప్పున.. ఏటా రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. తర్వాత ప్రభుత్వం ఈ సొమ్మును ఏడాదికి రూ.10 వేలు చేసింది. 2018 వానాకాలం సీజన్‌లో 1.30కోట్ల ఎకరాలకు చెందిన 50.25లక్షల మంది రైతులకు రూ.5,236 కోట్లు జమచేయగా.. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. మొత్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్‌ వరకు మొత్తంగా రైతుబంధు కింద రైతులకు రూ.72,815 కోట్లు జమ చేశారు. 

90శాతంపైగా రైతులు ఐదెకరాల్లోపు వారే.. 
ఈ ఏడాది వానాకాలం సీజన్‌ లెక్కల ప్రకారం చూస్తే.. రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షల మందికాగా.. అందులో అత్యధికంగా ఎకరాలోపే భూమి ఉన్న రైతులే 22.55 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో ఉన్న భూమి 12.85 లక్షల ఎకరాలు మాత్రమే. 
♦  ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి రైతుల సంఖ్య 16.98 లక్షలుకాగా.. వీరి చేతిలో ఉన్న మొత్తం భూమి 25.57 లక్షల ఎకరాలు. 
♦  రెండు నుంచి మూడెకరాల వరకు ఉన్న రైతులు 10.89 లక్షలు అయితే ఉండగా.. వీరి మొత్తం భూమి 26.50 లక్షల ఎకరాలు. 
♦ ఇక మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్న 6.64 లక్షల మంది రైతుల చేతిలో 22.62 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. 
♦  నాలుగు నుంచి ఐదెకరాల భూమి ఉన్న 5.26 లక్షల మంది చేతిలో 21.04 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. 
♦ మొత్తంగా ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలుకాగా.. వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుల్లో 90శాతానికిపైగా ఐదెకరాలలోపే భూములు ఉన్నాయి. 
♦  ఐదెకరాలకు పైబడి భూమిన ఉన్న రైతుల సంఖ్య కేవలం 6.65 లక్షలే.. కానీ వారి వద్ద ఏకంగా 52 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. 
♦ ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యధికంగా సన్నచిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారని.. ఐదెకరాల పరిమితి విధిస్తే అవసరమైన రైతులకు పథకాన్ని వర్తింపచేసినట్టు అవుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement