మెట్రో మళ్లీ 'మొదటి'కి.. | Central Govt conduct another study on second phase of Metro Rail expansion | Sakshi
Sakshi News home page

మెట్రో మళ్లీ 'మొదటి'కి..

Jun 24 2026 1:33 AM | Updated on Jun 24 2026 5:08 AM

Central Govt conduct another study on second phase of Metro Rail expansion

అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి

మెట్రో తొలిదశ స్వాదీనం, రెండో దశ విస్తరణపై మరోసారి అధ్యయనానికి కేంద్రం నిర్ణయం

ఎస్‌బీఐ క్యాప్స్‌ సంస్థతో అధ్యయనం

ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్‌ కార్యాచరణ 

ఐడీబీఐ నివేదిక అటకెక్కినట్టేనా? 

గందరగోళంగా మారిన స్వాదీన ప్రక్రియ 

రెండో దశ నిర్మాణ డీపీఆర్‌లో అనివార్యమైన మార్పులు  

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రైలు మొదటిదశ స్వాదీన ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. రెండు నెలల క్రితమే ఎల్‌అండ్‌టీ నుంచి ఈ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి రుణాలు బదిలీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో  మెట్రో స్వాధీనం, విస్తరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సంప్రదింపులు జరిపారు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–  ఐ వాల్యూయేషన్‌తోపాటు స్వా«దీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌–2 విస్తరణ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఎస్‌బీఐ క్యాపిటల్‌ను కన్సల్టెన్సీగా నియమించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఎస్‌బీఐ క్యాప్స్‌ అందజేసే నివేదిక ఆధారంగా భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని పేర్కొనడంతో టేకోవర్‌ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఫలితంగా మొదటి దశ టేకోవర్‌ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఎస్‌బీఐ క్యాప్స్‌ సంస్థ మెట్రో మొదటిదశపై అంచనాలను రూపొందిస్తూనే రెండోదశ నిర్మాణ వ్యయాన్ని కూడా అంచనా వేయనుంది. దీంతో రెండో దశ డీపీఆర్‌లో కూడా మార్పులు అనివార్యమయ్యాయి. 

ఐడీబీఐ నివేదిక సంగతేంటీ...  
మెట్రో మొదటిదశ ప్రాజెక్టును ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ నుంచి గత ఏప్రిల్‌ 29న టేకోవర్‌ చేసిన సంగతి తెలిసిందే. గత సెపె్టంబర్‌లో మెట్రో మొదటి దశ ప్రాజెక్టు నుంచి తప్పుకోనున్నట్లు ఎల్‌అండ్‌టీ ప్రకటించినప్పటి నుంచి దశలవారీగా అనేక పరిణామాలు జరిగాయి. మూడు కారిడార్‌లలోని 69 కి.మీ. మెట్రో మొదటి దశ ప్రాజెక్టుపై అంచనాలను రూపొందించేందుకు అప్పట్లో ఐడీబీఐ సంస్థను నియమించారు. అలాగే సాంకేతిక అంశాలపై అంచనాల బాధ్యతలను ఢిల్లీ మెట్రోరైల్‌కు అప్పగించారు. ఈ రెండు సంస్థలు అందజేసిన నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ముందుకెళ్లింది. రూ.1,461.47 కోట్ల ఎల్‌అండ్‌టీ ఈక్విటీని చెల్లించడంతోపాటు రూ.13,538.53 కోట్ల అప్పును రీఫైనాన్స్‌ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఐఆర్‌ఎఫ్‌సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 

ఈ నెలాఖరునాటికి చెల్లింపులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్‌గా కూడా ఐడీబీఐ క్యాపిటల్‌ సంస్థ వ్యవహరిస్తుందని నిర్ణయించారు. కానీ ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రుణాలు అందకపోవడంతో జాప్యం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు విజయవంతంగా ముగిసినట్లు సీఎం ప్రకటించారు. అయితే, ఐడీబీఐ స్థానంలో ప్రస్తుతం ఎస్‌బీఐ క్యాపిటల్‌ను కన్సల్టెన్సీగా నియమించడంతో టేకోవర్‌ ప్రక్రియ ముందుకెళ్తోందా, వెనకడుగు వేస్తోందా తెలియని అయోమయం నెలకొంది. 

ఇప్పటి వరకు ఇలా... 
రెండో దశ నిర్మాణానికి అనుమతులను ఇచ్చేందుకు మొదటి దశ ప్రాజెక్టును ఎలా నిర్వహిస్తారంటూ కేంద్రం పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మొదటి దశ ప్రాజెక్టు నుంచి తప్పుకోనున్నట్లు ఎల్‌అండ్‌టీ సంస్థ గత సెపె్టంబర్‌లో ప్రకటించింది. రెండోదశకు ఆటంకంగా ఉన్న మొదటిదశను ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలు దఫాలుగా జరిపిన చర్చలు, సంప్రదింపులు, ఐఆర్‌ఎఫ్‌సీతో కుదుర్చుకున్న ఒప్పందం అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌ 29న అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐఆర్‌ఎఫ్‌సీ, ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ (హైదరాబాద్‌)లిమిటెడ్, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ సంస్థలు ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. రూ.13,600 కోట్ల రుణ సౌకర్యాన్ని నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు, కమర్షియల్‌ పేపర్లు, వర్కింగ్‌ కాపిటల్‌ రీఫైనాన్సింగ్‌ వంటి రుణ అవసరాలకు వినియోగించాలని ఒప్పందం చేసుకున్నారు. మే ఆఖరుకల్లా రుణాల రీఫైనాన్సింగ్‌ పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటివరకూ ఈ ప్రక్రియ పట్టాలెక్కలేదు.  

మరోసారి అంచనాలు ఎందుకు? 
మెట్రో మొదటి దశ టేకోవర్‌పై మరోసారి అంచనాలను రూపొందించాలని నిర్ణయించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటనేది చర్చనీయాంశంగా మారింది. రూ.30 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రూ.15వేల కోట్లకే టేకోర్‌ చేసినట్లు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ టేకోవర్‌ వల్ల మెట్రో ప్రాజెక్టు కోసం కేటాయించిన 269 ఎకరాల భూములు ప్రభుత్వపరం కానున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లో నిర్మించిన మాల్స్, షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో సుమారు 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. మెట్రోకు కేటాయించిన ఆస్తులను లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ఎల్‌అండ్‌టీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. 

ఇప్పటివరకు ఎల్‌అండ్‌టీ సంస్థ కేవలం 4 లక్షల చదరపు అడుగులను మాత్రమే లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించింది. రాయదుర్గం వద్ద ఉన్న కొంత భూమిని మాత్రం ఓ ప్రైవేట్‌ సంస్థకు లీజుకు ఇచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో భూముల విలువ గణనీయంగా పెరిగిన దృష్ట్యా మెట్రో భూములను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం లభించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మెట్రో మొదటిదశ అంచనాలపై మరోసారి అధ్యయనం చేయాలని కేంద్రం కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ క్యాపిటల్‌ సంస్థను కన్సల్టెన్సీగా నియమించినట్లు తెలుస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement