
తుది ఫలితాలు విడుదల.. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అర్హుల జాబితా
మార్చి 30 నాటి జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఆధారంగా ఖరారు
563 ఖాళీలకు గాను 562 పోస్టులు భర్తీ
హైకోర్టు ఆదేశాలతో విత్‌హెల్డ్‌లో ఒక పోస్టు
తుది ఫలితాలు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు లోబడి ఉంటాయన్న కమిషన్ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేసింది. వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. మొత్తం 563 ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 562 పోస్టులను అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేసింది. ఒక పోస్టును మాత్రం హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పెండింగ్‌లో ఉంచింది.
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 18 పోస్టు కోడ్‌లకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ కార్యదర్శి ప్రియాంక ఆల బుధవారం అర్థరాత్రి విడుదల చేసిన వెబ్‌నోట్‌లో ప్రకటించారు. అభ్యర్థుల తుది జాబితాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఆధారంగా ఖరారు చేసినట్లు ఆమె తెలిపారు. గ్రూప్–1 తుది ఫలితాలు హైకోర్టు రిట్ అప్పీల్ నంబర్ 1066/2025, ఇతర పెండింగ్‌లో ఉన్న అన్ని రిట్ పిటిషన్లకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు.
గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం, ధ్రువపత్రాల వివరాల ఆధారంగా ఎంపిక జరిగిందని, ఈ వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే తక్షణమే వారికి సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని, తెలంగాణ గెజిట్ నంబర్ 60: తేదీ. 28/12/2015లో పొందుపర్చిన టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో వివరించారు.
గ్రూప్–1 టాపర్లు వీరే
లక్ష్మీ దీపిక, దాడి వెంకటరమణ, వంశీ కృష్ణారెడ్డి, జిన్న తేజస్విని, సిద్దాల కృతిక, హర్షవర్ధన్, కె.అనూష, ఏరండ్ల నిఖిత, కె.భవ్య, శ్రీకృష్ణ సాయి. వీరంతా డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఒకట్రెండు రోజుల్లో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది.