హాస్టల్‌ గదిలో ఉరేసుకుని.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య | BTech student ends life in hyderabad | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ గదిలో ఉరేసుకుని.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

May 11 2025 7:11 AM | Updated on May 11 2025 7:11 AM

BTech student ends life in hyderabad

ఇబ్రహీంపట్నం గురునానక్‌ 

ఇంజనీరింగ్‌ కళాశాలలో ఘటన 

ఆందోళనకు దిగిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం  

హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నం పరిధిలోని గురునానక్‌ కళాశాల హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కురనవెల్లికి చెందిన ఆలూరి భావన (22) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె గదిలో ఉండే మరో ఇద్దరు విద్యారి్థనులు స్వగ్రామాలకు వెళ్లడంతో ప్రస్తుతం భావన మాత్రమే ఉంది. కారణాలేమిటో తెలియదు గానీ.. శనివారం తన గదిలోని ఫ్యాన్‌కు ఆమె ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి విద్యార్థినులు యాజమాన్యంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి శశిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

కాలేజీ వద్ద ఉద్రిక్తత 
విద్యార్థిని భావన ఆత్మహత్య విషయం తెలుసుకున్న మిత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు గేట్లు దూకి లోపలికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను ఏసీపీ రాజు, సీఐ జగదీశ్‌లు అదుపులోకి తీసుకున్నారు.   

ఆత్మహత్యలకు అడ్డాగా మారింది 
గురునానక్‌ కళాశాల హాస్టల్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, కార్యదర్శి శంకర్‌ మండిపడ్డారు. భావన బలవన్మరణానికి పాల్పడిందనే విషయాన్ని బయటకు చెప్పకుండా, ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారని మండిపడ్డారు. కాలేజీలో గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్‌ పాటు ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement