అంగుళం కూడా వదలకుండా స్వాదీనం చేసుకుంటాం | BRS Working President KTR on HCU lands | Sakshi
Sakshi News home page

అంగుళం కూడా వదలకుండా స్వాదీనం చేసుకుంటాం

Apr 4 2025 4:47 AM | Updated on Apr 4 2025 4:47 AM

BRS Working President KTR on HCU lands

హెచ్‌సీయూ భూములపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కంచ గచ్చిబౌలి లో ‘ఎకో పార్కు’ 

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించి ప్రజలకు కానుకగా ఇస్తాం 

సీఎం అంటే నియంత, చక్రవర్తి కాదు.. పెద్ద పాలేరు మాత్రమే 

సాక్షి, హైదరాబాద్‌: మరో మూడేళ్లలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. ఆ భూము ల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎకో పార్క్‌ను ఏర్పా టు చేసి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజలకు కానుకగా ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్‌సీయూ భూమిని అంగట్లో సరుకులా చూస్తున్నారని మండిపడ్డారు. 

రేవంత్‌రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి ఎవరైనా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూములను కొనుగోలు చేస్తే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాల్లో ప్రతీ అంగుళం భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్, కాలే రు వెంకటేశ్‌తో కలసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభు త్వం తన నిర్ణయం మార్చుకోని పక్షంలో హైదరాబాద్‌ ప్రజలతో కలసి సెంట్రల్‌ యూనివర్సిటీ వరకు ర్యాలీ చేపడతామన్నారు.  

విద్యార్థుల పోరాట స్ఫూర్తికి సెల్యూట్‌.. 
‘హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన, పోరాట స్ఫూర్తికి బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున సెల్యూట్‌ చేస్తున్నాం. పది రోజులుగా విద్యార్థులు పోరాటం చేస్తుంటే ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వమైతే వారిని పిలిచి మాట్లాడాలి. ఆందోళనను విరమింపజేసే ఆలోచన చేయాలి. 

కనీసం ప్రభుత్వ అధికారులు లేదా మంత్రిని పంపి విద్యార్థులతో చర్చించాలి. కానీ ఆందోళన చేస్తున్న విద్యార్థులను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ‘గుంట నక్కలు’అంటూ సంబోధిస్తున్నారు. మరో మంత్రి పేమెంట్‌ బ్యాచ్‌ అంటూ విద్యార్థులపై నోరు పారేసుకుంటున్నారు. హెచ్‌సీయూలో జంతువులు లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన కృత్రిమ మేధస్సును బయట పెట్టుకుంటున్నారు’అని కేటీఆర్‌ విమర్శించారు.  

ముఖ్యమంత్రి రేవంత్‌ పెద్ద పాలేరు మాత్రమే.. 
‘హెచ్‌సీయూ భూమిపై కొట్లాడుకునేందుకు ఇదేమీ దాయాదుల పోరు, ఆస్తి తగాదా కాదు. యూనివర్సిటీ విద్యార్థులకు రేవంత్‌ బంధువు కాదు. ముఖ్యమంత్రి అంటే నియంత, చక్రవర్తి, రాజు కాదు. పెద్ద పాలేరు తరహాలో ప్రజా సేవ చేయాలి. ప్రజాపాలన అంటూ ప్రజాస్వామిక స్ఫూర్తికి పాతరవేసి బుల్డోజర్లు, జేసీబీలతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ భూములకు సీఎం కేవలం తాత్కాలిక ధర్మకర్త మాత్రమే’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

రాహుల్‌ గాంధీ స్పందించాలి 
హెచ్‌సీయూలో విద్యార్థులపై లాఠీచార్జి జరుగుతున్నా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. తాము చేస్తున్నది రాజకీయ పోరాటం కాదని, హైదరాబాద్‌ భవిష్యత్తు కోసమే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. న్యాయపరంగా, నైతికంగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణవేత్తలకు అండగా నిలుస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. 

హెచ్‌సీయూ విద్యార్థుల విజయం: కేటీఆర్‌ 
‘కంచ గచ్చిబౌలి  వ్యవహారాన్ని సుప్రీంకోర్టు చేపట్టడం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు సాధించిన విజయం. విద్యార్థుల నిస్వార్థ, నిరంతర స్ఫూర్తివంతమైన పోరాటం వల్లనే ఈ సానుకూల తీర్పు వచ్చింది. భూముల పరిరక్షణకు మద్దతు ఇచ్చిన పర్యావరణ ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు, మీడియా, సోషల్‌ మీడియా మిత్రులకు ధన్యవాదాలు..’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. 

కాగా.. ‘ఆ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం రేవంత్‌రెడ్డి దుందుడుకు చర్యలకు చెంపపెట్టు లాంటిది. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు హెచ్‌సీయూ భూముల విషయంలో అక్షింతలు. అధికారం బలంతో ఏది పడితే అది చేస్తామంటే చట్టం చూస్తూ ఊరుకోదు..’అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement