వికారాబాద్‌లో జరిగిన అవగాహన కార్యక్రమంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న కేటీఆర్
వికారాబాద్/మొయినాబాద్: స్పీకర్.. సీఎం..ఇక్కడి ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల పేరిట రైతుల భూములు కొల్లగొడుతున్నారని, బాధిత రైతులకు అండగా బీఆర్‌ఎస్ ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అధ్యక్షతన సర్, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ ‘స్పీకర్ పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారు... పోలీసులారా ఖబడ్దార్.. వచ్చేది మేమే.. మా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మేము మిమ్మల్ని గుర్తు బెట్టుకుంటం.. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం’అన్నారు.
సీఎంను ప్రశ్నిస్తే ‘ఎంత మొగోడైనా మూడు నెలల్లో పిల్లలు పుట్టిస్తరా అంటడు.. మూడు నెలల్లో పుట్టరు.. ముప్పై నెలలు అయినా పుట్టకపోతే ఏమనాలో మీరే చెప్పాలి’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి మోదీ అంటే భయమని, బడేభాయ్ ఏది చెప్తే.. చోటా భాయ్ జీ హుజూర్ అంటారని, అందుకే బడేబాయ్ అడగ్గానే దామగుండం అడవిలో 2,700 ఎకరాలు నేవీకి రాసిచ్చిండని, నాడు తమకు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అడవి జోలికి రాకుండా మోదీని అడ్డుకున్నామన్నారు. ప్రతి ఒక్కరు బూత్ స్థాయినుంచి గట్టిగా పనిచేయాలని, రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలనే నినాదంతో ముందుకు వెళితే అధికారంలోకి వచ్చేది మనమే అన్నారు.
లోక్‌సభకు ఎన్నికకు నామినేట్ చేసిన మీనాక్షినటరాజన్ అభ్యర్థిత్వాన్ని నాశనం చేసింది ముమ్మాటికి సీఎం రేవంత్‌రెడ్డే అని, బీజేపీ కాంగ్రెస్‌ది అక్రమ పొత్తులని అందరికి అర్థం అవుతోందన్నారు. ఓట్లు తొలగించి పశ్చింబెంగాల్‌లో మమతను బీజేపీ ఓడించిందని, ఏపీలోనూ చంద్రబాబు ఇదే చేయించి వైసీపీని ఓడించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితారెడ్డి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో తెలంగాణ అమరవీరుడు మందడి యాదిరెడ్డి కుటుంబ సభ్యులు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎనికేపల్లికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త డప్పు కరంచంద్ కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. పార్టీ పరంగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


