
భువనగిరిలో నళినిని పరామర్శిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, చిత్రంలో ఆమె కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు
రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్
మాజీ డీఎస్పీకి పరామర్శ.. ఆమెను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని వెల్లడి
రామ్‌దేవ్ బాబాతో వైద్యం అందిస్తామని హామీ
సాక్షి, యాదాద్రి: తీవ్ర అనారోగ్యానికి గురైన తెలంగాణ ఉద్యమకారిణి, మాజీ డీఎస్పీ నళినికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ ప్రతినిధులతో కలిసి భువనగిరిలోని నళిని ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా నళిని తన అనారోగ్య సమస్యను బీజేపీ నేతలకు తెలియజేశారు.
అనంతరం రాంచందర్‌రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ గతంలో ఆర్థిక ప్రయోజనాలను ఇప్పిస్తానని హామీ ఇచ్చినా అమలు చేయలేదని నళిని చెప్పారన్నారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయి ఆరోగ్యం క్షీణించిందన్నారు. ప్రధాని మోదీని కలవాలని ఉందని నళిని చెప్పారని.. ఇందుకోసం పార్టీ తరఫున ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుంటానన్నారు. ఆమెకు యోగా గురువు రామ్‌దేవ్ బాబాతో వైద్యం చేయిస్తామని పేర్కొన్నారు. ‘నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. నా జీవితాశయం యోగశాల నిర్మాణం పూర్తి చేయాలి.
ప్రభుత్వం నుంచి నాకు రావాల్సిన డబ్బు వస్తే యోగశాల నిర్మాణానికి ఖర్చుచేస్తా. నాకు ఏ ఇతర ఆర్థిక సాయం అవసరం లేదు’అని ఆమె రాంచందర్‌రావుకు వివరించారు. రాంచందర్‌రావు వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల ఆశోక్, ఉపా«ధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కాసం వెంకటేశ్వర్లు, నాయకులు ఊట్కూరి ఆశోక్‌గౌడ్, గూడురు నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు.
నళినికి భువనగిరి కలెక్టర్ పరామర్శ
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశంతో భువనగిరి కలెక్టర్ హనుమంతరావు సోమవారం భువనగిరిలో నళినిని నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. సర్విస్ సమస్యలు ఏమైనా ఉంటే నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం చెప్పినట్లు కలెక్టర్ ఆమెకు వివరించారు. ప్రభుత్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. కాగా, నళిని అభ్యర్థన మేరకు తప్పకుండా తాను ప్రధానికి లేఖ రాసి వైద్య సాయం అందేలా చూస్తానని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.