
హైదరాబాద్: దసరా ఉత్సవాల్లో భాగంగా నగరంలో నిర్వహించిన ఓ బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. సరూర్‌నగర్ స్టేడియంలో ఈరోజ(సెప్టెంబర్ 29) నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్‌లో చోటు దక్కించుకుంది. 64 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ చుట్టూలయ బద్ధంగా ఆడిన నృత్యం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.., ఒక్కేసి పువ్వేసి సందమామా.. చిత్తూచిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గు మ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనా’అంటూ బతుకమ్మ పాటలతో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం మార్మోగింది.. బంతి, చేమంతి, గునుగు, గులాబీ, తంగేడు, గడ్డిపువ్వు వంటి తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు దర్శనమిచ్చాయి.. ఒకే వేదికపై సుమారు దివేల మంది మహిళలు బతుకమ్మ ఆడిపాడి కనువిందు చేశరు. మన బతుకమ్మ కార్నివాల్ పేరుతో ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుక అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నిస్‌లో రికార్డుల్లోకి ఎక్కడం విశేషం.
నవరాత్రి వేడుకల్లో భాగంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సరూర్‌నగర్ వేదికగా ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ఈవెంట్’కు భారీ ఏర్పాట్లు చేశారు. ఇండోర్ సహా అవుట్ డోర్ స్టేడియాల్లో 64 అడుగుల ఎత్తు బతుకమ్మను ఏర్పాటు చేశారు.
గ్రేటర్ జిల్లాలు సహా సరిహద్దు జిల్లాల నుంచి 200 బస్సుల్లో మహిళలను ఆదివారం ఉదయమే స్టేడియానికి రప్పించి, ఆయా పాటలకు శిక్షణ ఇప్పించారు. వేడుకలో భాగంగా పాడే పాటలు, ప్రదర్శనలపై ముందే రిహార్సల్స్ చేశారు.