ఆదిలాబాద్ జిల్లా: గజం భూమి కోసం గొడవలు జరుగుతున్న రోజులివి. ఎంత ఆస్తి ఉన్నా.. పక్క వారికి సాయం చేసే గుణం అరుదు. అలాంటిది తనకున్న మూడెకరాల్లో ఓ ఎకరం ఇందిరమ్మ ఇళ్ల కోసం దానం చేసి దాతృత్వం చాటుకున్నారు ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని దుబ్బగూడ గ్రామానికి చెందిన ఆత్రం లేతు బాయ్. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలు సొంతస్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలో తన వంతుగా ఎకరం భూమిని తహసీల్దార్ జాదవ్ రామారావుకు శుక్రవారం అందించారు. ప్రస్తుతం ఈ స్థలంలో 10 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా లేతుబాయ్ మాట్లాడుతూ గ్రామంలో ఇల్లు లేక పలువురు ఇబ్బందులు పడుతున్న క్రమంలో తనవంతుగా స్థలం అందించాలని భావించినట్లు చెప్పారు. సమాజ సేవతో ఎంతో సంతృప్తి లభిస్తుందన్నారు. లేతు బాయ్‌ను గ్రామస్తులతో పాటు కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేకంగా అభినందించారు.


