ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు.. మిక్స్‌డ్‌ వెదర్‌తో మహా డేంజర్‌! డాక్టర్ల కీలక సూచనలు ఇవే..

Doctors Says Danger With Mixed weather - Sakshi

ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు వర్షాలతో మారిపోతున్న వాతావరణం 

ఇన్ఫెక్షన్లు సోకేందుకు, వైరస్‌ల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు 

సీజనల్‌ వేరియేషన్స్‌తో పొంచి ఉన్న అనారోగ్య సమస్యలు 

జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం వేసవి కాలం చివరి రోజుల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రమంతా ఉదయం నుంచే 40 నుంచి 45 డిగ్రీల ఎండలు హీటెక్కిస్తున్నాయి. వడగాడ్పులతోపాటు అప్పుడప్పుడు సాయంత్రం అకస్మాత్తుగా గాలివాన కురియడంతో వాతావరణం చల్లబడుతోంది. అదీగాక వేసవి సీజన్‌ ముగిసిపోతుండటంతో ఎండలు చండప్రచండంగా మారుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణ శాఖ నివేదికలున్నా.. ప్రతీ ఏడాది ఇవి ఆలస్యంగానే వస్తున్నాయి.

అందువల్ల మరికొన్ని రోజులపాటు ఇలాంటి ‘మిక్స్‌డ్‌ వెదర్‌’తోనే ప్రజలు నెట్టుకురాక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వాతావరణంలో బ్యాక్టీరియాలు, వైరస్‌లు చురుగ్గా ఉండి దాడి చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా మసలుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.  

వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాలి
అటు వేడి, ఇటు చల్లదనం వంటి మధ్యస్థ వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్‌లు యాక్టివ్‌గా ఉంటాయి. మన శరీరాలు కూడా అటు వేడికి, ఇటు చల్లటి వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంటుంది. అలాంటి సమయం కోసం వైరస్‌లు, బ్యాక్టీరియాలు వేచిచూసి దాడిచేస్తాయి. టైఫాయిడ్, సీజనల్‌ జ్వరాలు, గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ల వంటివి వచ్చే అవకాశాలు అధికమవుతాయి.

ఇలాంటి వాటికి ఆహారాన్నే ఔషధంగా మార్చుకుని తిప్పికొట్టాలి. ఫ్రైడ్‌ పదార్ధాలు, జంక్‌ఫుడ్‌ వంటివి మానేయాలి. అప్పటికప్పుడు వేడిగా తయారుచేసిన ఆహారపదార్థాలు తీసుకోవాలి. వేడి చేసి చల్లార్చిన నీరు లేదా పరిశుభ్రమైన నీటిని తాగాలి. తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే వ్యాధినిరోధక« శక్తిని పెంచుకోవాలి.  

నీటిని ఎక్కువగా తాగాలి 
తీవ్ర ఎండ వేడిమి నుంచి చల్లటి వాతావరణానికి మారినపుడు అనేక జబ్బులు వ్యాపిస్తాయి. ఇంకా తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నందున వడదెబ్బ తగులకుండా, డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగడంతోపాటు సహజమైన పళ్లరసాలు వంటివి తీసుకోవాలి. దోమలు, ఎలుకలు వంటి వాటి ద్వారా నీరు.. గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి.

డెంగీ, మలేరియా వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్‌ ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం నీటిలో తడిచిన ప్రతీసారి ఫ్రెష్‌గా స్నానం చేయాలి. ఏడాదికోసారి ఫ్లూవ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top