సాక్షి, చైన్నె: కాంచీపురం సమీపంలోని పడునెల్లి గ్రామంలో జరుగుతున్న మారియమ్మన్ ఆలయ ఆడి ఉత్సవాల్లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘర్షణ ఇద్దరి దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో వందలాదిగా పోలీసులను మోహరించారు. వివరాలు.. పడునెల్లి గ్రామంలో ఆడి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకల్లో భాగంగా పొంగళ్ళు సమర్పించి పూజలు నిర్వహించిన అనంతరం, రాత్రి స్వామివారి ఊరేగింపునకు ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న కొందరు స్థానిక యువకులు మైక్ సెట్‌లో గానా పాటలు ప్లే చేయాలని నిర్వాహకులతో గొడవకు దిగారు. అక్కడున్నవారు దీనిని నిరసించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆ తాగుబోతుల ముఠా అక్కడి నుండి పరారైంది.
పాత కక్షలతో దాడి – ఇద్దరి మరణం
అనంతరం, ఆ ముఠా పాత కక్షలను మనసులో ఉంచుకుని, అదే ప్రాంతానికి చెందిన చంద్రు, విక్కీ (అలియాస్ నీలకండన్) అనే ఇద్దరు యువకులపై అర్థరాత్రి సమయంలో వేటకొడవళ్లతో తీవ్రంగా దాడి చేసి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వీరిద్దరూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పొన్నేరిక్కరై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు ప్ర యత్నించగా, బాధితుల బంధువులు వారిని అడ్డుకున్నారు. సకాలంలో సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఈ హత్యలు జరిగాయని ఆరోపిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపిన అనంతరం వేకువ జామున పోలీసులు మృతదేహాలను చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.
3 ప్రత్యేక బృందాల ఏర్పాటు
కాంచీపురం జిల్లా ఎస్పీ అరవింద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి 3 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా వందలాది మంది పోలీసులను మోహరించారు. పొన్నేరిక్కరై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.


