? | - | Sakshi
Sakshi News home page

?

Apr 8 2026 7:32 AM | Updated on Apr 8 2026 7:32 AM

తెలుగు ఓటర్లే కీలకం

తెలుగు నేతల మధ్య కీలక సమరం

టీవీకే వర్సెస్‌ అన్నాడీఎంకే ఫైట్‌

రేసులో భుస్సీ ఆనంద్‌

సత్య కుస్తీ

కీసెగ్మెంట్‌
టీ నగర్‌..
దక్కేదెవరికో..

ప్రధాన సమస్యలు:

● ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించినా టి.నగర్‌లో ట్రాఫిక్‌ సమస్య తీరడం లేదు. మెట్రో రైలు పనుల కారణంగా గత రెండేళ్లుగా రద్దీ మరింత పెరిగింది.

● పాండీ బజార్‌లోని మల్టీ–లెవల్‌ పార్కింగ్‌ సౌకర్యం తరచుగా సాంకేతిక సమస్యలతో మూతపడటం లేదా పూర్తి సామర్థ్యంతో నిండిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్‌ సమస్యా ఎక్కువే.

● వర్షాల సమయంలో వెస్ట్‌ మాంబళం వంటి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కడం పరిపాటిగా మారింది. వర్షపు నీటి కాలువల నిర్మాణం జరిగినా, ప్రయోజనం ఆశించిన స్థాయిలో లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

● నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో వాయు కాలుష్యం పెరగడం, వాణిజ్య సముదాయాల నుండి వెలువడే టన్నుల కొద్దీ చెత్తను సక్రమంగా తొలగించకపోవడం ప్రధాన సమస్యలుగా మారాయి.

సాక్షి, చైన్నె: చైన్నె నగరంలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా టీనగర్‌ (త్యాగరాయ నగర్‌) ఉంది. ఈ నియోజకవర్గంలో తాజాగా సమరం రసవత్తరంగా మారింది. తెలుగు, బ్రహ్మణ ఓట్లతో కూడిన ఈ పరిసరాలలో తెలుగు నేపథ్యం కలిగిన ఇద్దరు నేతల మధ్య సమరం హోరా హోరీగా మారి ఉంది. ఇందులో ఒకరు టీవీకే ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌ కాగా, మరొకరు అన్నాడీఎంకే అభ్యర్థి సత్యనారాయణన్‌ అలియాస్‌ సత్య. ఇక, డీఎంకే అభ్యర్థిగా రాజా అన్భళగన్‌, నామ్‌ తమిళర్‌ కట్చి(ఎన్‌టీకే) అభ్య ర్థిగా అనూష్‌ విజయకుమార్‌ పోటీలో ఉన్నారు. వివరాలు.. చైన్నెకి గుండెకాయగా టీ.నగర్‌ను పరిగణించవచ్చు. కేవలం వాణిజ్య కేంద్రంగానే కాకుండా అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంగానూ ఇది ఉంది. కోడంబాక్కం, వెస్ట్‌ మాంబళం, అశోక్‌ నగర్‌ వంటి కీలక ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.

రాజకీయ చదరంగంలో..

టీ నగర్‌ నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరం. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ నియోజకవర్గంలో 1957 నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే– 6 సార్లు , అన్నాడీఎంకే – 4 సార్లు గెలిచింది. కాంగ్రెస్‌– 2 సార్లు, టీఎంసీ ఒక సారి విజయం సాధించింది. అన్నాడీఎంకే గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని 2021లో డీఎంకే కై వశం చేసుకుంది. డీఎంకే అభ్యర్థి జె. కరుణానిధి (దివంగత డీఎంకే నేత జె. అన్బళగన్‌ సోదరుడు) 56,035 ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే అభ్యర్థి టి.నగర్‌ సత్య 55,898 ఓట్లు సాధించారు. కేవలం 137 ఓట్ల స్వల్ప తేడాతో డీఎంకే విజయం సాధించింది. ఇక్కడ మొత్తం ఓటర్లు 1,54,943. వీరిలో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇందులో పురుషులు – 74,682, మహిళలు –80,228, ఇతరులు 33 మంది ఉన్నారు.

2026 బరిలో ఉన్న అభ్యర్థులు

ఈసారి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అభ్యర్థులను రంగంలోకి దించాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే జె. కరుణానిధికి ఈ సారి డీఎంకే సీటు ఇవ్వలేదు. ఆయన స్థానంలో జె. అన్బళగన్‌ కుమారుడు రాజా అన్బళగన్‌ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తృటిలో విజయాన్ని కోల్పోయిన టి.నగర్‌ సత్య మళ్లీ పోటీలో ఉన్నారు. కూటమి పార్టీల బలం ఈసారి తనను గెలిపిస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. అయితే, ప్రపథమంగా ఎన్నికలను ఎదుర్కొంటున్న తమిళగ వెట్రికళగం (టీవీకే)తరపున ఇక్కడ ఆపార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ ఆనంద్‌ అలియాస్‌ భుస్సీ ఆనంద్‌ పోటీలో ఉన్నారు. ఒంగోలు పూర్వీకంగా కలిగి పుదుచ్చేరిలో స్థిర పడి, తదుపరి విజయ్‌కు సన్నిహితుడై పార్టీ స్థాపనలో భుస్సీ ఆనంద్‌ కీలకంగా వ్యవహరించారు. ఈ నియోజకవర్గంలోని యువత, బ్రహ్మణ, తెలుగు ఓటర్లతో పాటుగా మైనారిటీ యువత ఓట్లు కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉండటంతో భుస్సీ ఆనంద్‌ విస్తృతంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇక్కడ తెలుగు ఓటర్లు , బ్రహ్మణ సామాజిక వర్గం ఓట్లు ఎటు వైపు అన్నది కీలకంగా మారింది. ఓ వైపు భుస్సీ ఆనంద్‌, మరో వైపు సత్య ఈ ఓట్లపై దృష్టి పెట్టారు. ఇక, నామ్‌ తమిళర్‌ కట్చి తరపున మహిళా అభ్యర్థిగా అనూష విజయకుమార్‌ పోటీలో ఉన్నారు. గత ఎన్నికలలో 137 ఓట్లతో ఓడిన సత్య ఈసారి గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఇక, డీఎంకే అభ్యర్థి రాజా అన్భళగన్‌ అయితే, తన తండ్రి అన్భళగన్‌ చరిష్మా , ప్రభుత్వ సంక్షేమ పథకాలను గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. అయితే పెరిగిన వాణిజ్యీకరణతో నివాస ప్రాంతాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులపై నెలకొన్న వ్యతిరేకతను అధిగమించడం డీఎంకేకు సవాలుగా మారింది. ఇక ఈ మూడు పార్టీ మగరాయుళ్లను ఎన్‌టీకే తరపున అనూష విజయకుమార్‌ ఢీ కొడుతున్నారు. మహిళా ఓటర్లు తనను ఆదరిస్తారన్న నమ్మం ఆమెలో మెండుగా ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement