సాక్షి, చైన్నె: కోయంబత్తూరు బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల వారసులకు తమిళనాడు ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆమె మాట్లాడుతూ, గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే పార్టీ ప్రచార సభలో ఘోర తొక్కిసలాట జరిగిందని గుర్తు చేస్తూ, ఇందులో మరణించిన 41 మంది కుటుంబాలలో 31 మంది కి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వడం ఆహ్వానించ దగ్గ విషయమేనని పేర్కొంటూ, ఈ నిర్ణయం తరహా లోనే, గతంలో జరిగిన కోయంబత్తూరు పేలుళ్ల బాధితులను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 1998 ఫిబ్రవరి 14న సీనియర్ బీజేపీ నాయకుడు ఎల్.కె. అద్వానీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కోయంబత్తూరుకు వచ్చిన సమయంలో, ఆయనను లక్ష్యంగా చేసుకుని మత ఛాందసవాద ఉగ్రవాదులు నగరంలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఈ దారుణ ఉగ్రదాడిలో 58 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నారు.
పోలీసుల వైఫల్యం వల్లే నాటి ప్రమాదం:
ఈఘటనలో మరణించిన వారంతా ఎలాంటి తప్పుచేయని సాధారణ పౌరులు అని, వివిధ పను ల కోసం, షాపింగ్ కోసం వీధుల్లోకి వచ్చినవారే అని వివరించారు. వారిలో చాలా మంది తమ కుటుంబాలకు ఏకైక ఆధారంగా ఉన్నవారేనని, ఉగ్రవాదుల కదలికలను ముందే పసిగట్టడంలో, బాంబుదాడులను నివారించడంలో నిఘా విభాగం, పోలీసుశాఖ పూర్తిగా విఫలమయ్యాయి అని పేర్కొన్నారు. ఆ వైఫల్యం కారణంగానే వారు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, నాటి నుండి నేటి వరకు ఆ కుటుంబాలు జీవనోపాధి కోసం ఎంతో పోరాడుతున్నాయన్నారు. ప్రభుత్వం అనేది ప్రజలందరికీ సమానంగా ఉండాలని, ప్రభుత్వ కరుణా దృక్పథం కేవలం ఒక వర్గానికి లేదా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకూడదన్నారు. బాధితులందరిౖని సమానంగా చూడాలని క్రూర మైన ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కోయంబత్తూరు బాంబు పేలుళ్ల బాధితుల కుటుంబ వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


