tnagar
-
టీ నగర్.. దక్కేదెవరికో?
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా టీనగర్ (త్యాగరాయ నగర్) ఉంది. ఈ నియోజకవర్గంలో తాజాగా సమరం రసవత్తరంగా మారింది. తెలుగు, బ్రహ్మణ ఓట్లతో కూడిన ఈ పరిసరాలలో తెలుగు నేపథ్యం కలిగిన ఇద్దరు నేతల మధ్య సమరం హోరా హోరీగా మారి ఉంది. ఇందులో ఒకరు టీవీకే ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ కాగా, మరొకరు అన్నాడీఎంకే అభ్యర్థి సత్యనారాయణన్ అలియాస్ సత్య. ఇక, డీఎంకే అభ్యర్థిగా రాజా అన్భళగన్, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) అభ్యర్థిగా అనూష్ విజయకుమార్ పోటీలో ఉన్నారు. వివరాలు.. చైన్నెకి గుండెకాయగా టీ.నగర్‌ను పరిగణించవచ్చు. కేవలం వాణిజ్య కేంద్రంగానే కాకుండా అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంగానూ ఇది ఉంది. కోడంబాక్కం, వెస్ట్ మాంబళం, అశోక్ నగర్ వంటి కీలక ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.రాజకీయ చదరంగంలో..టీ నగర్ నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరం. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ నియోజకవర్గంలో 1957 నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే– 6 సార్లు, అన్నాడీఎంకే – 4 సార్లు గెలిచింది. కాంగ్రెస్– 2 సార్లు, టీఎంసీ ఒక సారి విజయం సాధించింది. అన్నాడీఎంకే గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని 2021లో డీఎంకే కై వశం చేసుకుంది. డీఎంకే అభ్యర్థి జె. కరుణానిధి (దివంగత డీఎంకే నేత జె. అన్బళగన్ సోదరుడు) 56,035 ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే అభ్యర్థి టి.నగర్ సత్య 55,898 ఓట్లు సాధించారు. కేవలం 137 ఓట్ల స్వల్ప తేడాతో డీఎంకే విజయం సాధించింది. ఇక్కడ మొత్తం ఓటర్లు 1,54,943. వీరిలో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇందులో పురుషులు – 74,682, మహిళలు –80,228, ఇతరులు 33 మంది ఉన్నారు.2026 బరిలో ఉన్న అభ్యర్థులుఈసారి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అభ్యర్థులను రంగంలోకి దించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే జె. కరుణానిధికి ఈ సారి డీఎంకే సీటు ఇవ్వలేదు. ఆయన స్థానంలో జె. అన్బళగన్ కుమారుడు రాజా అన్బళగన్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తృటిలో విజయాన్ని కోల్పోయిన టి.నగర్ సత్య మళ్లీ పోటీలో ఉన్నారు. కూటమి పార్టీల బలం ఈసారి తనను గెలిపిస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. అయితే, ప్రపథమంగా ఎన్నికలను ఎదుర్కొంటున్న తమిళగ వెట్రికళగం (టీవీకే)తరపున ఇక్కడ ఆపార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ ఆనంద్ అలియాస్ భుస్సీ ఆనంద్ పోటీలో ఉన్నారు. ఒంగోలు పూర్వీకంగా కలిగి పుదుచ్చేరిలో స్థిర పడి, తదుపరి విజయ్‌కు సన్నిహితుడై పార్టీ స్థాపనలో భుస్సీ ఆనంద్ కీలకంగా వ్యవహరించారు. ఈ నియోజకవర్గంలోని యువత, బ్రహ్మణ, తెలుగు ఓటర్లతో పాటుగా మైనారిటీ యువత ఓట్లు కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉండటంతో భుస్సీ ఆనంద్ విస్తృతంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇక్కడ తెలుగు ఓటర్లు , బ్రహ్మణ సామాజిక వర్గం ఓట్లు ఎటు వైపు అన్నది కీలకంగా మారింది. ఓ వైపు భుస్సీ ఆనంద్, మరో వైపు సత్య ఈ ఓట్లపై దృష్టి పెట్టారు. ఇక, నామ్ తమిళర్ కట్చి తరపున మహిళా అభ్యర్థిగా అనూష విజయకుమార్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికలలో 137 ఓట్లతో ఓడిన సత్య ఈసారి గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఇక, డీఎంకే అభ్యర్థి రాజా అన్భళగన్ అయితే, తన తండ్రి అన్భళగన్ చరిష్మా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. అయితే పెరిగిన వాణిజ్యీకరణతో నివాస ప్రాంతాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులపై నెలకొన్న వ్యతిరేకతను అధిగమించడం డీఎంకేకు సవాలుగా మారింది. ఇక ఈ మూడు పార్టీ మగరాయుళ్లను ఎన్టీకే తరపున అనూష విజయకుమార్ ఢీ కొడుతున్నారు. మహిళా ఓటర్లు తనను ఆదరిస్తారన్న నమ్మం ఆమెలో మెండుగా ఉండటం గమనార్హం.ప్రధాన సమస్యలు:● ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించినా టి.నగర్లో ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. మెట్రో రైలు పనుల కారణంగా గత రెండేళ్లుగా రద్దీ మరింత పెరిగింది.● పాండీ బజార్‌లోని మల్టీ–లెవల్ పార్కింగ్ సౌకర్యం తరచుగా సాంకేతిక సమస్యలతో మూతపడటం లేదా పూర్తి సామర్థ్యంతో నిండిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ సమస్యా ఎక్కువే.● వర్షాల సమయంలో వెస్ట్ మాంబళం వంటి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కడం పరిపాటిగా మారింది. వర్షపు నీటి కాలువల నిర్మాణం జరిగినా, ప్రయోజనం ఆశించిన స్థాయిలో లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.● నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో వాయు కాలుష్యం పెరగడం, వాణిజ్య సముదాయాల నుండి వెలువడే టన్నుల కొద్దీ చెత్తను సక్రమంగా తొలగించకపోవడం ప్రధాన సమస్యలుగా మారాయి. -
అక్క బదులు చెల్లెలు.. పోలీసులకు ఫిర్యాదు
టీ.నగర్(చెన్నై): అక్క కోసం పరీక్ష రాసిన చెల్లెలిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వివరాలు.. మదురైకు చెందిన మీనాక్షి గత 3 ఫిబ్రవరి 2019లో తిరుచ్చి అరియమంగళంలోని ఎస్ఐటీ కళాశాలలో జరిగిన ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ పరీక్ష రాశారు. అయితే దీనిపై పలు ఫిర్యాదులు అందడంతో తిరుచ్చి అరియమంగళం పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణలో ఆంగ్లం షార్ట్‌హ్యాండ్ పరీక్ష రాసేందుకు మదురైకు చెందిన రామలక్ష్మి దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు పరీక్ష సమయంలో అనారోగ్యం ఏర్పడడంతో ఆమె సోదరి మీనాక్షి పరీక్ష రాసేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం ఆమె నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి, హాల్‌టిక్కెట్‌లో తన ఫొటో అతికించి అక్రమాలకు పాల్పడింది. కొన్ని రోజుల క్రిందట మీనాక్షి తన స్నేహితురాళ్లతో అక్రమంగా పరీక్ష రాసినట్లు తెలిపింది. ఆమె స్నేహితురాళ్లు తమ సన్నిహితులతో చెప్పడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీనిగురించి షార్ట్‌హ్యాండ్ పరీక్ష నిర్వహించిన విద్యాసంస్థ తరపున తిరుచ్చి అరియమంగళం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
హిందూ నేతలపై దాడులు అరికట్టాలి
టీనగర్: హిందూ సంస్థల నిర్వాహకులపై దాడులను అరికట్టేందుకు పోలీసులు చర్యలు గైకొనాలంటూ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఆందోళన జరిగింది. ఈ ఆందోళనకు పోలీసుల అనుమతి లేకపోవడంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా సహా కార్యకర్తలు ఐదు వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరుకు చెందిన హిందూ మున్నని నేత శశికుమార్ కొన్ని రోజుల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇదివరకే దిండుగల్, కన్యాకుమారి జిల్లాలలో హిందూ సంస్థలకు చెందిన నిర్వాహకులు హత్యకు గురయ్యారు. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం రాజరత్నం స్టేడియం సమీపాన ఆందోళన జరపనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దీంతో బుధవారం ఉదయం నుంచే బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఈ ఆందోళనకు పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఇందులో జాతీయ కార్యదర్శి హెచ్ రాజా, రాష్ట్ర కార్యదర్శి రాఘవన్, చెన్నై జిల్లా ఇంచార్జి నేత చక్రవర్తి, ఉపాధ్యక్షుడు శంకర్ సహా 700 మంది పాల్గొన్నారు. ఆందోళనలో హిందూ సంస్థ నిర్వాహకులను హతమారుస్తున్న వారిని అరెస్టు చేయడంలోను, హత్యల గురించి నేరపరిశోధన జరపడంలో పోలీసుల ఉదాసీన వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఇలావుండగా ఆందోళనకు అనుమతి లేదని తెలుపుతూ పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులు హఠాత్తుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు తమిళిసై సహా 700 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. వీరందరినీ వ్యానులో ఎక్కించి సమీపాన ఉన్న మండపాలలో నిర్బంధించారు. దీంతో ఆ ప్రాంతాలలో సంచలనం ఏర్పడింది. ఈ సందర్భంగా తమిళిసై విలేకరులతో మాట్లాడుతూ హిందూ సంస్థలైన ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ వంటి సంస్థల నేతలు రాష్ట్రంలో హత్యకు గురికావడం పరిపాటిగా మారిందని, హంతకులపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనికి నిరసనగా తాము ఆందోళనలు జరిపేందుకు పోలీసుల అనుమతి కోరగా నిరాకరిస్తున్నట్లు తెలిపారు. దీంతో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ఆందోళన చేపట్టామని తెలిపారు.సీబీసీఐడీకి శశికుమార్ హత్య కేసు: కోయంబత్తూరులో తీవ్ర సంచలనాన్ని కలిగించిన హిందూ మున్నని నేత శశికుమార్ హత్య కేసు సీబీసీఐడీకి మార్చబడింది. శశికుమార్ హత్య కేసులో మిస్టరీ ఛేదించేందుకు డీఐజీ నాగరాజన్ నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఈ కేసులో అనేక అధారాలను సేకరిస్తున్నారు. అయినప్పటికీ హత్య జరిగి వారం రోజులైనా కేసులో పురోగతి లేనందున ఈ కేసును సీబీసీఐడీ పోలీసు విచారణకు మార్పు చేస్తూ డీజీపీ రాజేంద్రన్ ఆదేశాలిచ్చారు. బీజేపీ నేత దుకాణానికి నిప్పు: దుకాణాల బంద్: తిరుపూర్-ధారాపురం రోడ్డు ప్రాంతానికి చెందిన వ్యక్తి శివ అలియాస్ రన్నింగ్ శివ(35). బీజేపీ నేత అయిన ఇతను రన్నింగ్ ట్రేడర్ పేరుతో కాంగేయం క్రాస్ రోడ్డులో బనియన్ సంస్థకు అవసరమైన ఆయిల్, యంత్రాల విడిభాగాలను విక్రయించే దుకాణం నడుపుతున్నారు. మంగళవారం రాత్రి వ్యాపారం ముగించుకుని రన్నింగ్ శివ ఇంటికి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు రన్నింగ్ శివ దుకాణ ంపై పెట్రోలు కుమ్మరించి నిప్పంటించారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు ప్రజల సహకారంతో మంటలను అర్పివేశారు. అయినప్పటికీ దుకాణంలోని ఆయిల్, టీవీ, యంత్రాల విడిభాగాలు కాలిపోయాయి. ఈ విషయం తెలియగానే హిందూ మున్నని, బీజేపీ నేతలు, కార్యకర్తలు దుకాణం ఎదుట గుమికూడి రాస్తారోకో జరిపారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి వెళ్లమని కోరగా వారు నిరాకరించారు. దీంతో పోలీసులు, బీజేపీ వర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ సంఘటనతో కాంగేయం ప్రాంతంలోని దుకాణాలను మూసివేశారు. దీంతో అక్కడ సంచలనం ఏర్పడింది.


