8న జరిగే కూటమి భేటీని బహిష్కరిస్తున్నాం
కాంగ్రెస్ పాల్గొనే ఏ సమావేశంలోనూ మేము పాల్గొనం
అధికారికంగా ప్రకటించిన డీఎంకే
సాక్షి, చెన్నై: కేంద్రంలో అధికార ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన విపక్ష ‘ఇండియా’కూటమి క్రమంగా విచ్చిన్నమవుతోంది. కూటమి నుంచి కీలక పార్టీ డీఎంకే దూరం జరుగుతోంది. ఢిల్లీలో ఈ నెల 8న జరగబోయే కూటమి కీలక సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నామని గురువారం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఏ సమావేశంలోనూ డీఎంకే భాగస్వామి కాబోదని తేల్చిచెప్పింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత కాంగ్రెస్ తమకు చేసిన నమ్మక ద్రోహం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన లక్షలాది మంది కార్యకర్తల భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే అధిష్టానం తేల్చిచెప్పింది. ఈ మేరకు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది.
ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జూన్ 8న జరగనున్న విపక్షాల సమావేశానికి తమకు ఆహా్వనం అందినట్టు వెల్లడించింది. అయితే, ఆ భేటీకి హాజరయ్యే ఆలోచన లేదని పేర్కొంది. ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు దేశ శ్రేయస్సు కోసం లేవనెత్తే సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటామని ప్రకటించింది. విపక్ష కూటమి ఏర్పడిన నాటి నుంచి దానికి కేంద్ర బిందువుగా డీఎంకే పని చేసినట్లు గుర్తుచేసింది.
లోక్‌సభలో ఇక వేర్వేరుగానే...
లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుల నుంచి విడిగా కూర్చోవడానికి డీఎంకే ఎంపీలకు బుధవారం అనుమతి లభించింది. కాంగ్రెస్‌తో తమ పొత్తు ముగిసిందని, తమ సభ్యులు కాంగ్రెస్ సభ్యులతో కలిసి కూర్చోలేరని డీఎంకే గత నెలలో తేల్చిచెప్పింది. లోక్‌సభలో తమ ఎంపీల సీటింగ్ ఆరేంజ్‌మెంట్‌లో మార్పు చేయాలని కోరింది. కాంగ్రెస్ సభ్యులకు దూరంగా తమకు సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. దీనిపై లోక్‌సభ సెక్రెటేరియట్ సానుకూలంగా స్పందించి, అనుమతి ఇచి్చనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అందుకే కూటమికి దూరం..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెల్చుకుంది. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. విజయ్ ప్రభుత్వ మంత్రివర్గంలోనూ చేరింది. ఎన్నికల ప్రచార సమయంలోనే డీఎంకే, కాంగ్రెస్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఒకే వేదికను పంచుకోవడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాకరించారు.
ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొన్నారు. దీంతో డీఎంకే, కాంగ్రెస్ బంధం పూర్తిగా తెగిపోయినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఆ కూటమిలో డీఎంకే కీలక భాగస్వామిగా ఉండేది. తమ కూటమి తరఫున ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అభ్యరి్థత్వాన్ని స్టాలిన్ ప్రతిపాదించారు.


