రచయితలకు ప్రాధాన్యం పెరగాలి..! | - | Sakshi
Sakshi News home page

రచయితలకు ప్రాధాన్యం పెరగాలి..!

Feb 9 2026 7:41 AM | Updated on Feb 9 2026 2:14 PM

Film Actor & Actress with Vijay Antony

విజయ్‌ ఆంటోనితో చిత్ర హిరోహిరోయిన్

తమిళసినిమా: సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. తాజాగా ఆయన తన సోదరి కొడుకు అజయ్‌ దిశన్‌ హీరోగా రూపొందించిన చిత్రం పుక్కీ. నటి ధనుషా నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఛాయాగ్రహకుడు గణేశ్‌ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్‌ఆంటోని ఫిలిం కార్పోరేషన్‌ పతాకంపై మీరా విజయ్‌ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రానికి నటుడు విజయ్‌ ఆంటోని సంగీతం, కూర్పు బాధ్యతలను నిర్వహించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న పుక్కీ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ గణేశ్‌ చంద్రను ఇంతకు ముందు తానే ఛాయాగ్రహకుడిగా పరిచయం చేశానని, ఇప్పుడు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయన శ్రమ చాలా క్లియర్‌గా తెలుస్తుందన్నారు. ఈ రొమాంటిక్‌ ప్రేమ కథా చిత్రాన్ని గణేశ్‌ చంద్ర చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని పత్రికల వారు ప్రశంచిస్తారన్నారు. మలయాళ సినిమాలో మాదిరిగా తమిళ చిత్ర పరిశ్రమలోనూ కథారచయితలకు ప్రాముఖ్యత పెరగాలన్నారు. ఆ విధంగా పుదియ భారతి ముఖ్యమైన కథా రచయిత అని పేర్కొన్నారు. 

ఈ చిత్రం తరువాత ఆయన ఉన్నత స్థాయికి చేరుకుంటారనే నమ్మకం తనకు ఉందన్నారు. నటుడు అజయ్‌ విషయానికి వస్తే తను చాలా మంచి వ్యక్తి అని, నిజాయితీగా పని చేస్తారని అన్నారు. నటి ధనుషా చాలా తెలివైన, ప్రతిభావంతురాలైన నటి అని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు అజయ్‌ దిశన్‌ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. తన జీవితంలో ఎంతో అనుభవాన్నిచ్చిన చిత్రం అని అన్నారు. తాను ఊహించని పలు విషయాలను నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు గణేశ్‌ చంద్ర మాట్లాడుతూ ఇప్పటి వరకూ కెమెరా వెనుక ఉన్న తనను కెమెరా ముందుకు తీసుకొచ్చి యాక్షన్‌ అని చెప్పేలా చేసిన విజయ్‌ఆంటోనికి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తుస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement