బండి మాకొద్దు బాబోయ్‌..! | Sakshi
Sakshi News home page

బండి మాకొద్దు బాబోయ్‌..!

Published Mon, May 29 2023 7:02 AM

చైన్నెలో వాహనదారుడికి జరిమానా విధిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు  - Sakshi

నిబంధనలు ఉల్లంఘించి జరిమానాకు గురవుతున్న వాహనదారులు తమ వాహనాలను స్టేషన్లలోనే వదిలేస్తున్నారు. ఫైన్‌లు పెద్దమొత్తంలో ఉండడంతో వాటిని చెల్లించలేక సతమతం అవుతున్నారు. దీంతో సీజ్‌ చేసిన వాహనాలతో రాజధాని చైన్నెలోని పోలీస్‌ స్టేషన్లు నిండిపోతున్నాయి.

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారికి, మద్యం మత్తులో వాహనం నడిపి పట్టుబడ్డ వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. పెద్దమొత్తంలో ఫైన్‌లు విధిస్తున్నారు. దీంతో జరిమానాలు చెల్లించలేక తమ వాహనాలను వదులు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాదిన్నర కాలంలో 50 వేల వాహనాలు పోలీసు స్టేషన్లకు పరిమితమై తుప్పు బడుతుండడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో 371 వాహనాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు.

ట్రాఫిక్‌ పోలీసుల దూకుడు..
చైన్నెతో పాటు ఇతర నగరాల్లో ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘించే వారి సంఖ్య ఎక్కువే. ఇలాంటి వారి భరతం పట్టే రీతిలో ట్రాఫిక్‌ పోలీసులు దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించకుండా వాహనాలు నడిపే వారు కొందరు అయితే, ట్రిబుల్‌ రైటింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు మరికొందరు. సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్ర కారు కూడా ఎక్కువే. వీరితోపాటు రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారికీ పోలీసులు జరిమానాల మోత మోగిస్తున్నారు. తాజాగా మోటార్‌ వెహికల్‌ చట్టం అమల్లోకి రావడంతో జరిమానాల వడ్డనే కాదు, నిబంధనలూ మరింత కఠినతరం అయ్యాయి. గత ఏడాదిన్నర కాలంగా చైన్నెలోనే కాదు రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలలో ట్రాఫిక్‌ నిబంధనల్ని పాటించకుండా ముందుకు సాగే వారి భరతం పట్టే విధంగా పోలీసులు ముందుకెళ్తున్నారు.

జరిమానాలు చెల్లించలేక..
ట్రాఫిక్‌ నిబంధనల్ని పదే పదే ఉల్లంఘించడం, ప్రమాదాలకు కారకులుగా ఉండే వాహన చోదకులు, మందు బాంబులకు రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత ఆధారంగా ఈ చెలాన్లపై అధిక దృష్టి పెడుతున్నారు. వాహనాలను సీజ్‌ చేయడం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లు లేదా కోర్టుల్లో వాటి యజమానులు జరిమానా చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ పోలీసులే కాదు, నేర విభాగం పోలీసులు సైతం జరిమానాల వడ్డనలో బిజీగానే ఉన్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ జరిమానాలు చెల్లించ లేక అనేక మంది తమ వాహనాలను వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధిక వేగం, మద్యం మత్తులో వాహనాలు నడిపే వారికి రూ. 10 వేలు జరిమానా విధిస్తుండడంతో వాటిని చెల్లించే పరిస్థితి లేక వాహనాలను పోలీసు స్టేషన్ల వద్దే వదలి పెట్టి వెళ్తున్నారు. పోలీసులు తమను పట్టుకున్న చోటే వాహనం వదిలి ఉడాయించే వారూ ఉన్నారు. ఇక, రూ. 10 వేలు కూడా విలువ చేయని తమ వాహనానికి ఎందుకు అంత భారీస్థాయిలో జరిమానా కట్టాలన్నట్లు.. వాహనం మీరే ఉంచుకోండి అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు.

తుప్పు పడుతున్న వాహనాలు
గత ఏడాదిన్నర కాలంలో 50 వేల వాహనాలకు చెందిన యజమానులు జరిమానా చెల్లించక పోవడంతో ఆ వాహనాలన్నీ పోలీసు స్టేషన్ల బయట, పోలీసులకు సంబంధించిన ఖాళీ ప్రదేశాల్లో పార్క్‌ చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 43 కోట్ల వరకు జరిమానా విధించారు. ఇందులో రూ. 16 కోట్లు మాత్రమే వసూళ్‌లైంది. జరిమానా చెల్లించిన వారి వాహనాలను తిరిగి అప్పగిస్తున్నారు. చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న మిగిలిన వారి వాహనాలు పోలీస్‌ స్టేషన్ల సమీపంలో రోడ్ల మీద తప్పుబట్టే విధంగా పడి ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వాళ్లే ఉన్నట్టు పరిశీలనలో తేలింది. ఇక సీజ్‌ చేసిన వాటిలో 371 వాహనాలను వేలం వేయాలని చైన్నెలోని పోలీసు అధికారులు తాజాగా నిర్ణయించారు.

పోలీస్‌ స్టేషన్ల వద్ద నెలల తరబడి తుప్పు పడుతున్న వాహనాలు
1/1

పోలీస్‌ స్టేషన్ల వద్ద నెలల తరబడి తుప్పు పడుతున్న వాహనాలు

Advertisement
 
Advertisement