సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాహనాలపై పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులను పెండింగ్ చలాన్‌లను చెల్లించమని బలవంతపెట్టొద్దని పోలీసులకు సూచించింది.
తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్ల విషయమై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై న్యాయవాది విజయ్‌గోపాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు.. వాహనదారులు చలాన్‌లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం వంటివి చేయవద్దు. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్‌లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చు. అంతేకానీ.. పెండింగ్ చలాన్‌లను చెల్లించమని బలవంతపెట్టొద్దు అని ఆదేశించింది.
ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఆటోమెటిక్‌గా చాలా చలాన్ కట్ అయ్యేలా టెక్నాలజీ తీసుకురావాలని అన్నారు. అయితే సీఎం వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెండింగ్ చలాన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లించమని పోలీసులు.. పౌరులను ఆపొద్దని, బలవంతం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది .


