డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమమే
తిరువళ్లూరు: డిమాండ్ల పరిష్కారం కోరుతూ దశల వారీగా ఆందోళన నిర్వహిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం ఉదయం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనకు రెవెన్యూ ఉద్యోగుల ఐక్యవేదిక సంఘం నేతలు జవహర్, సెంథిల్‌కుమరన్, సెంథిల్‌కుమార్, మణిగండన్, కృష్ణన్ తదితరులు అద్యక్షత వహించారు. ఈ సందర్బంగా మణిగండన్ మాట్లాడుతూ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టడంతో పాటూ ఉన్నత అధికారుల నుంచి వేధింపులకు గురి కాకుండా ఉద్యోగ భద్రత చట్టాన్ని అమలు చేయాలని కోరారు. రెవెన్యూ అసిస్టెంట్‌లకు వేతనం పెంపు, సర్వేయర్, రెవెన్యూ ఉద్యోగులకు వేతనాల క్రమబద్దీకరణ చేయాలి కోరారు. విధుల్లో మరణించే ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వ్యక్తులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని, రెవెన్యూ సర్వేయర్ విభాగంలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ తిరుపతి– చైన్నె జాతీయ రహదారిలో ఆందోళన నిర్వహించారు. కాగా అనుమతి లేకుండా రాస్తారోకోకు దిగిన దాదాపు 400 మంది ఉద్యోగులను అరెస్టు చేశారు.
దివ్యాంగుల ఆందోళన
తమ సమస్యలను పరిస్కరించాలనీ కోరుతూ ఆందోళన నిర్వహించిన సుమారు 62 మంది దివ్యాంగులను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు నటేషన్ మాట్లాడుతూ వైద్య పరీక్షల ద్వారా వైకల్యాన్ని కచ్చితంగా లెక్కగట్టి రూ. 6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలు పింఛన్ ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. అనంతరం రైతు బజారు వద్ద రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమమే


