ఆందోళనలతో దద్దరిల్లిన కలెక్టరేట్
వేలూరు: వేలూరు కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ, అంగన్‌వాడీ, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకులు, తమిళనాడు దివ్యాంగుల సంక్షేమ సంఘం వంటి సంఘాల ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తమిళనాడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పన్నీర్‌సెల్వం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్‌లకు పది శాతం అదనపు పెన్షన్ అందజేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అదే విధంగా అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ సహాయకులకు రూ.7,850 కనీస పెన్షన్‌గా ఇస్తామని ప్రకటించి ప్రస్తుతం మరోసారి ఎన్నికల వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేవిధంగా తమిళనాడు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు కలెక్టరేట్ ఎదుట ఉన్న రోడ్డుకు అడ్డంగా కూర్చొని రాస్తారోకో చేశారు. పోలీసులు రెవెన్యూ, అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రయివేటు కళ్యాణ మండపానికి తరలించారు.


