హైదరాబాద్: నేను రోడ్డెక్కలేదు.. నా బండి నంబర్ రికార్డు చేసుకోండి.. నేను ఊదనంటే.. ఉద.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లో పోలీసులకు ఓ వాహనదారు చుక్కలు చూపించాడు. ఎంతసేపు వారించినా బ్రీత్ ఎనలైజర్‌లో ఊదనంటే ఊదనంటూ అరగంట పాటు వాగ్వాదానికి దిగాడు. చివరికి బైక్‌ను వదిలేసి వెళ్లాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45లో ట్రాఫిక్ పోలీసులు బుధవారం రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
స్కూటర్‌పై ఓ యువకుడు రావడంతో ఆపారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలని.. అందులోకి ఊదాల్సిందిగా పోలీసు సిబ్బంది అతడికి సూచించారు. ‘నేను అసలు రోడ్డే ఎక్కలేదు.. నేనెందుకు ఊదుతా’నంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌కు సహకరించకుండా అరగంట పాటు పోలీసులతో వాదించాడు. చివరకు బైక్‌ను వదిలేసి పారిపోయాడు. పోలీసులు బైక్‌ను సీజ్ చేశారు.


