పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవు
సూర్యాపేట టౌన్ : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చే వాహనాలకు రోడ్డు పక్కన నిలిపిన లారీలు, భారీ వాహనాలు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో నిలిపి ఉంచిన వాహనాలను వెనుక నుంచి వచ్చే ఇతర వాహనాలు ఢీకొంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. జిల్లా మీదుగా వెళ్లే ఎన్‌హెచ్– 65పై హోటళ్లు, దాబాలు, పెట్రోల్ బంకులు, వాణిజ్య సముదాయాల సమీపంలో లారీలను ప్రధాన రహదారిపైనే వరుసగా పార్కింగ్ చేస్తుండడం సమస్యగా మారింది. కొందరు డ్రైవర్లు నిర్దేశిత పార్కింగ్ స్థలాలను వాడకుండా రోడ్డునే పార్కింగ్ జోన్‌గా మార్చడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు
అక్రమ పార్కింగ్‌పై పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గత ఆగస్టులో ఎన్‌హెచ్– 65పై అక్రమ పార్కింగ్‌కు సంబంధించి 2,551 కేసులు నమోదు చేయగా, ఈ నెల 19 వరకు మరో 1,276 కేసులు రాశారు. కేవలం ఈ రెండు నెలల్లోనే ఏకంగా 3,827 కేసులు నమోదయ్యాయంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తప్పించే క్రమంలో ప్రమాదాలు
రహదారి పక్కన నిలిపి ఉంచిన భారీ వాహనాలను తప్పించేందుకు వెనుక నుంచి వచ్చే వాహనదారులు ఒక్కసారిగా లేన్ మార్చాల్సి వస్తోంది. ఈ క్రమంలో పక్కనే లేదా వెనుక వేగంగా వచ్చే వాహనాలను ఢీకొడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, కార్ల ప్రయాణికులు ఈ అక్రమ పార్కింగ్ వల్ల తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు.
జాతీయ రహదారిపై ఎక్కడపడితే అక్కడ లారీలు, భారీ వాహనాలు నిలిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ప్రమాదాల నివారణకు డ్రైవర్లు తప్పనిసరిగా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలనే వినియోగించాలి. అడ్డగోలుగా రోడ్డుపై వాహనాలు ఆపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.
– నరసింహ, ఎస్పీ
ఫ హైవేపై అక్రమ పార్కింగ్‌కు
సంబంధించి కేసులు నమోదు చేసిన పోలీసులు
ఫ దాబాలు, పెట్రోల్ బంకుల వద్ద భారీ వాహనాల నిలిపివేతతో ప్రమాదాల ముప్పు
ఫ రాత్రివేళల్లో కనిపించక
ఢీకొంటున్న వాహనాలు


